టాలీవుడ్ యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. దీని తర్వాత ‘జై హనుమాన్’ పేరుతో సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి ముందు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌తో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రశాంత్ వర్మ – రణవీర్ సింగ్ కాంబో ఫిక్స్ అయిందని ఆ మద్య వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరి కాంబో మూవీకి ‘రాక్షస’ అనే టైటిల్‌ను సైతం మేకర్స్ పెట్టినట్లు టాక్ వినిపించింది.
ఇందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్ కోసం రణవీర్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాడని.. ఇక్కడ అతనిపై మూడు రోజుల పాటు కొన్ని సీన్లను చిత్రీకరించారని కూడా గుస గుసలు వినిపించాయి. అయితే సడెన్‌గా ఈ మూవీ ఆగిపోయిందని గత వారం రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రణవీర్ – ప్రశాంత్ వర్మ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని.. అందువల్లనే ఈ మూవీ నుంచి రణవీర్ సింగ్ వైదొలిగాడని వార్తలు జోరుగా సాగాయి.
అయితే ఈ రూమర్స్‌కు తాజాగా చెక్ పడింది. ఈ మూవీపై వస్తున్న రూమర్స్ అన్నీ అవాస్తవాలని నటుడు రణవీర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో భాగంగానే రణవీర్ సింగ్, ప్రశాంత్ వర్మ & మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటనతో స్పష్టం చేశారు. ఆ ప్రకటన ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌కు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. రణవీర్ సింగ్ వెర్షన్ చూసుకుంటే.. ‘‘ప్రశాంత్ చాలా ప్రత్యేకమైన, టాలెంటెడ్ దర్శకుడు. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని గట్టిగా ప్లాన్ చేశాం. భవిష్యత్తులో మేము ఈ సినిమా కోసం కలిసి వర్క్ చేస్తామని ఆశిస్తున్నాను’’ అంటూ పేర్కొన్నాడు.
మరొవైపు దర్శకుడు ప్రశాంత్ వర్మ వెర్షన్ చూస్తే.. ‘‘రణ్‌వీర్ సింగ్‌లో ఉండే ఎనర్జీ, టాలెంట్ ఉన్న నటులు దొరకడం చాలా అరుదు. కానీ అవన్నీ రణవీర్‌లో ఉన్నాయి. భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మేమిద్దరం కలిసి వర్క్ చేస్తాం’’ అంటూ తన శైలిలో పేర్కొన్నాడు. అయితే భవిష్యత్తులో తాము తప్పకుండా సినిమా చేస్తామని టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ‘జై హనుమాన్’ మూవీ అయితే.. దీనికోసం ఇంకా కాస్టింగ్ కంప్లీట్ కాలేదు. మరి ఇంకేమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.