ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తేల్చిచెప్పేశారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో వీడియో ఫుటేజ్ లో దొరికిన ఆయనపై ఇప్పటికే మూడు చట్టాల ప్రకారం 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద నమోదు చేసిన అభియోగాలు రుజువైతే ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.
ఈవీఎం ధ్వంసం ఘటనపై ఫిర్యాదు రాగానే ఫుటేజ్ తెప్పించుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదుకు ఆదేశించిన ఈసీ.. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసుల్ని పంపింది. అయితే పిన్నెల్లి కోసం హైదరాబాద్ వెళ్లిన పోలీసులకు ఇంకా ఆయన ఆచూకీ లభించలేదని తెలిసింది. ఇప్పటికే పిన్నెల్లిపై ఎయిర్ పోర్టుల్లో సైతం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాకపోతే రేపు పిన్నెల్లి అరెస్టు కావడం ఖాయం.
పిన్నెల్లి అరెస్టు తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరగబోతోందో సీఈవో ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. పిన్నెల్లిపై అభియోగాలు రుజువైతే ఆయనకు జైలుశిక్ష పడటం ఖాయమన్నారు. అయితే ఇది రెండేళ్లు, అంతకు మించి ఉంటే మాత్రం ఆయనపై అనర్హత వేటు పడుతుందని తెలిపారు. ఆయన ఈసారి ఎన్నికల్లో గెలిచినా రెండేళ్ల జైలుశిక్ష పడితే మాత్రం అనర్హత వేటు వేయాల్సి ఉంటుందన్నారు. అదే జరిగితే తిరిగి మాచర్ల నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహించాల్సిన పరిస్ధితి ఉంటుందని భావిస్తున్నారు.









