UPDATES  

NEWS

 పిన్నెల్లిపై ఈసీ సీరియస్- కఠిన చర్యలకు ఆదేశాలు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కఠిన చర్యలను తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది.

 

ఈ నెల 13వ తేదీన ఓటింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని 202, 7 నంబర్ పోలింగ్ స్టేషన్లల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డయింది. ఆ విజువల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్‌గామారాయి.

 

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావడం, నేరుగా ఓ కంపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టడం ఈ వీడియోల్లో చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడినందు వల్లే సంబంధిత ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారనేది వైఎస్ఆర్సీపీ వాదన.

 

అదెలా ఉన్నప్పటికీ- పిన్నెల్లి చర్యలను ఈసీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సమగ్ర నివేదిక కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రిపోర్టును ఈసీకి పింపించారు. ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫారసు చేయాలని ఈసీ ఆదేశించింది.

 

మాచర్ల, నరసరావుపేట, చిత్తూరు జిల్లా చంద్రగిరి వంటి పలు నియోజకవర్గాల్లో పోలింగ్ తరువాత హింసాత్మక పరిస్థితులు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్పీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటల దాడి చోటు చేసుకుంది. ఆరోపణలు ప్రత్యారోపణలు సంధించుకున్నారు.

 

వాటన్నింటిపైనా ఈసీ స్పందించింది. ఆయా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లపై బదిలీ వేటు వేసింది. సమగ్ర విచారణ చేపట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో పిన్నెల్లి విషయంలో ఈసీ రంంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |