కర్ణాటకలోని హుబ్బళిలోని ఓ ప్రైవేట్ కాలేజీ క్యాంపస్‌లో హుబ్బళి-ధారవాడ కార్పోరేషన్ కార్పొరేటర్, రాజకీయ నాయకుడు నిరంజన్ హిరేమఠ్ కుమార్తె నేహా కులకర్ణి దారుణ హత్యకు గురైయ్యింది. హత్య కేసుకు సంబంధించి నిందితుడు ఫయాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే సమయంలో కాలేజ్ అమ్మాయిని కాలేజ్ క్యాంపస్ లోనే దారుణంగా హత్య చెయ్యడం కర్ణాటకలో కలకలం రేపింది.
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజకీయ నాయకుడు, కార్పోరేటర్ నిరంజన్ కుమార్తెను ముస్లీం యువకుడు హత్య చెయ్యడంతో రాజకీయ రంగు పులుముకుంది. నేహా హత్య కేసులో సిద్దరామయ్య ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జేడీఎస్ ఆరోపణల దాడికి దిగింది. ప్రేమను నిరాకరించిన కళాశాల విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితులను రక్షించడానికి కర్ణాటకలో అధికారంలో ఉన్న కొందరు నాయకులు, కనిపించని కొన్ని చేతులు ప్రయత్నిస్తున్నాయని జేడీఎస్ ఆరోపించింది.
లవ్ జిహాద్ మోహాన్ని సాకుగా చూపిన అదృశ్య హస్తాలు, అలాంటి శక్తులే ఇప్పుడు హుబ్బళి విద్యార్థిని కుమారి నేహా హిరేమఠ్ ను పట్టపగలు కాలేజీ ఆవరణలో దారుణంగా హత్య చేశారని, హంతకులను రక్షించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని జేడీఎస్ ఆరోపించింది. ఈ ఘటనతో కర్ణాటకలోని కాలేజ్ అమ్మాయిలు అందరూ షాక్ అయ్యారని, ఇంత జరుగుతున్నా సిద్దరామయ్య ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తోందని జేడీఎస్ పార్టీ మండిపడుతోంది.
కర్ణాటకలో శాంతిభద్రతల వ్యవస్థ పట్టాలు తప్పిందనడానికి ఇదో స్పష్టమైన ఉదాహరణ అని, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వర్గాల మీద మితిమీరిన బుజ్జగింపులు ఇప్పుడు నేరపూరిత ఆలోచనాపరులకు నల్లమందు లాంటిది అయ్యిందని, అలాంటి నిందితులకు ఈ భూమి మీద ఉన్న చట్టాలు వర్తించవు అనే సందేహం కూడా కొందరికి ఉందని, సిద్దరామయ్య ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తోందని జేడీఎస్ ఆరోపించింది.
ప్రేమను నిరాకరించిన కాలేజ్ అమ్మాయి ప్రాణం తీసిన పాపాత్ముడు ఫయాజ్ ను తాము వదిలిపెట్టబోమని జేడీఎస్ హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కర్ణాటక ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని, దురదృష్టకరంగా హత్యకు గురైన కాలేజ్ విద్యార్థి నేహా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని జేడీఎస్ నాయకుల తెలిపారు. కాలేజ్ అమ్మాయి నేహా హత్య కేసు వ్యవహారంలో కర్ణాటక ప్రభుతం తీరుపై బీజేపీ, జేడీఎస్ నాయకులు మండిపడుతున్నారు.









