ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ లాబీ తరఫున కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ నిన్నఈడీ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేశాక ఢిల్లీ తరలించిన ఈడీ అధికారులు ఈ ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాక కోర్టులో హాజరుపర్చారు. కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో సమగ్రంగా విచారించాల్సి ఉన్నందున 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఇప్పటికే రెండుసార్లు విచారించిన ఈడీ అధికారులు.. ఆమె విచారణకు సహకరించలేదని వెల్లడించారు. కాబట్టి ఇప్పుడు ఆమెను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ కవిత లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కవితను అరెస్టు చేశారని ఆమె లాయర్లు వాదిస్తున్నారు.
మరోవైపు తనపై ఈడీ నమోదు చేసింది అక్రమ కేసని, అలాగే తన అరెస్టు కూడా అక్రమమని, తనను తప్పుడు కేసులో ఇరికించారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించే సమయంలో ఆమె మధ్యలో మీడియాతో మాట్లాడారు. ఈడీ తీరుపై న్యాయపోరాటం చేస్తామని కవిత ప్రకటించారు. ఇప్పటికే ఆమె లాయర్లు ఢిల్లీలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.









