ఊహించినట్టే- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పలు దఫాలుగా చర్చలు కొనసాగించడం, షరతులకు ఓకే చెప్పిన తరువాతే ఈ చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఎన్డీఏ నుంచి.
ఇటీవలే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తు విషయంపై చర్చించారు. సీట్ల పంపకాలపైనా తుది నిర్ణయాలను తీసుకున్నారు. బీజేపీకి కేటాయించాల్సిన సీట్లపై చంద్రబాబు నుంచి స్పష్టత తీసుకున్నారు. అనంతరం ఎన్డీఏలో చేరికకు అంగీకరించారు అమిత్ షా, జేపీ నడ్డా.
బీజేపీ- తెలుగుదేశం పొత్తు కుదిరిన మరుసటి రోజే.. బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది యాదృచ్చికమే. ఈ నెల 10వ తేదీన అద్దంకి వద్ద సిద్ధం బహిరంగ సభను నిర్వహించాలని ఇదివరకే వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది.









