వైసిపి హై కమాండ్ ఈ తొమ్మిదో జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. వై నాట్ 175 టార్గెట్ గా వైసీపీ ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. ఓడిపోయే అవకాశం ఉన్నవారిని జగన్ పక్కన పెడుతున్నారు. ఇదివరకు జాబితాలో పేర్లు ప్రకటించిన వారి సైతం మార్చుతుండడం విశేషం. అయితే తాజా జాబితాలో భారీ మార్పులు ప్రకటిస్తారని అంతా ఊహించారు. కానీ రెండు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి మాత్రమే మార్పులు చేశారు. నెల్లూరు లోక్సభ ఇన్చార్జిగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయ సాయి రెడ్డి పేరును ప్రకటించారు. మంగళగిరి అసెంబ్లీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్య, కర్నూలు అసెంబ్లీ ఇన్చార్జిగా ఏఎండి ఇంతియాజ్ లను ఖరారు చేశారు.
నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి బరిలో దిగడం అనివార్యంగా మారింది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జిగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. కానీ నెల్లూరు సిటీ అసెంబ్లీ ఇన్చార్జి నియామకంలో వేంరెడ్డిని కనీస పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి డిసైడ్ అయ్యారు. మరోవైపు విజయ్ సాయి రెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి పేరు వినిపించినా.. చివరకు విజయసాయి రెడ్డి వైపు మొగ్గు చూపారు. మరోవైపు టిడిపి అభ్యర్థిగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖరారు అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే బలమైన అభ్యర్థిని బరిలోదించాల్సిన అనివార్య పరిస్థితి జగన్ పై పడింది. అందుకే విజయ్ సాయి రెడ్డి వైపు మొగ్గు చూపారు.
మరోవైపు మంగళగిరిలో సైతం అభ్యర్థి మార్పు అనివార్యంగా మారింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలోనే తొలగించారు. గంజి చిరంజీవిని నియమించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మంగళగిరిలో చిరంజీవి అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో.. ఆయన స్థానంలో మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు. అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం యూటర్న్ తీసుకున్నారు. ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నిర్ణయంతో గంజి చిరంజీవి ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు. టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి నిరాకరించడంతో మనస్థాపానికి గురయ్యారు. ఈ తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.