UPDATES  

NEWS

 మావోయిస్టులు కీలక నిర్ణయం.. పోరాటానికి తాత్కాలిక విరమణ..

మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించింది. ఆయుధాలను వదిలి వేయాలని డిసైడ్ అయ్యింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. అంతేకాదు తమ నిర్ణయంపై ప్రజలు ఎవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ-మెయిల్, ఫేస్‌బుక్‌ ఐడీలను ఇవ్వడం కలకలం రేపింది. ఈ విధంగా చేయడం ఇదే తొలిసారి.

 

అసలు మావోల ప్రకటనలో అసలు మేటరేంటి? ఆగస్టు 15న ఈ ప్రకటన దాదాపు నెల రోజుల తర్వాత గతరాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతోపాటు ప్రతిపక్ష పార్టీలు, శాంతికమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేసినట్టు ఆ లేఖలో పేర్కొంది.

 

ఈ ఏడాది మార్చి చివరి నుంచి ప్రభుత్వంతో శాంతి చర్చలకు మా పార్టీ ప్రయత్నిస్తోందని తెలిపింది. మే 10న పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్‌ పేరుతో ప్రకటన విడుదలైంది. ఆయుధాలను వదులుకుంటున్నట్లు అందులో ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించిన మావోలు.. ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కోరినట్టు తెలిపారు.

 

ఈ విషయంలో కేంద్రం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదని, 2024 జనవరి నుంచి సైనిక దాడుల్ని తీవ్రతరం చేసిందని వెల్లడించింది. దాని ఫలితమే మే 21న మాడ్‌లోని గుండెకోట్‌ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్‌తోపాటు 28 మంది మృతిచెందారు.

 

బస్వరాజ్ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని ప్రధాని అభ్యర్థనల దృష్ట్యా తాము ఆయుధాలను వదలాలని నిర్ణయించుకున్నట్లు ప్రస్తావించింది.

 

ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి లేకుంటే ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలకు తాము సిద్ధమేనని పేర్కొంది. ఇది మా బాధ్యతగా పేర్కొన్న మావోయిస్టు పార్టీ, ఈ అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది.

 

వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న సహచరులు, జైళ్లలో ఉన్ వారితో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని తెలియజేసింది. దీనిపై ప్రభుత్వంతో వీడియో కాల్‌ ద్వారా మా అభిప్రాయాలను పంచుకోవడానికీ సిద్ధమేనని తెలిపారు. దీనికి సంబంధించి nampet (2025)@gmail.com, Facebook nampetalk ఐడీలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రస్తావించింది.

 

గాలింపు చర్యలను నిలిపివేయడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమనేది మీ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని ఆ లేఖ అభయ్‌ వివరించారు. మావోయిస్టుల లేఖపై బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ నోరు విప్పారు. ఆ లేఖ ప్రామాణికతను ధృవీకరిస్తున్నామన్నారు. చర్చల్లో పాల్గొనాలా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయమన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |