UPDATES  

NEWS

 జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు..!

దేశ ద్రోహి,పాక్‌ గూఢచారి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ టూర్ కు సంబంధించిన వివరాలను పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పాకిస్థాన్ జర్నీ ఆహ్లాదకరంగా సాగిందని.. అక్కడ ఆతిథ్యం బాగుందని రాసుకొచ్చింది.

 

ఈ మేరకు జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ ను పొగుడుతూ రాసుకున్నట్లు పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అంతేకాక ఆమె విచారణలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. దేశంలోని పలు ప్రధాన ఆలయాల వద్ద జ్యోతి రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఆలయాల పరిసరాల్లో వీడియోలు తీసిన జ్యోతి.. వాటిని పాక్ లోని ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

 

ఈ మేరకు జ్యోతి మల్హోత్రాతో పరిచయాలున్న యూట్యూబర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రీల్స్‌, వీడియోలు చేసిన జ్యోతి మల్హోత్రాను పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. అయితే తాను పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో టచ్‌ లో ఉన్నట్లు జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు సమాచారం అందుతోంది.

 

పాకిస్థాన్ హైకమిషన్‌ లో పనిచేసే డానిష్‌ అనే వ్యక్తితో తాను నిత్యం టచ్‌ లో ఉండేదాన్ని అని జ్యోతి మల్హోత్రా.. పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు సమాచారం. 2023లో వీసా కోసం పాక్‌ హైకమిషన్‌ కు వెళ్లినప్పుడు తొలిసారి డానిష్‌ తో పరిచయం ఏర్పడిందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది.

 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పాకిస్థాన్ కు జ్యోతి మల్హోత్రా చేరవేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆమె ట్రావెల్ వీడియోలు, వాట్సాప్ చాట్స్, ఇన్ స్టా పోస్టులు పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే పాకిస్థాన్ కు గూఢచర్యం చేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా పాక్ నుంచి డబ్బు తీసుకుని ఇక్కడి రహస్య సమాచారాన్ని.. పోలీసులు, అధికారుల కదలికలను ఎప్పటికప్పుడు పాకిస్థాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |