UPDATES  

NEWS

 మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సునీల్ కుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ ను ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అభియోగ పత్రం (ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్) నమోదు చేసింది. సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ఇటీవల సస్పెండైన సునీల్ కుమార్, గతంలో సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం పేర్కొంది.

 

ప్రభుత్వం నమోదు చేసిన ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్‌లో ప్రధానంగా ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా, తీసుకున్న అనుమతికి భిన్నంగా పలుమార్లు విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలు మోపింది. మొత్తం ఆరు వేర్వేరు సందర్భాల్లో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు ప్రభుత్వం తన అభియోగ పత్రంలో వివరంగా పేర్కొంది.

 

ప్రభుత్వం పేర్కొన్న అభియోగాలు

 

1. 2024 మార్చి 1న జార్జియా వెళుతున్నట్లు అనుమతి పొంది, దానికి బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లారని ప్రభుత్వం ఆరోపించింది.

2. 2023 సెప్టెంబర్ 2న ప్రభుత్వ అనుమతి లేకుండానే స్వీడన్ పర్యటనకు వెళ్లారని పేర్కొంది.

3. పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న సమయంలో, 2023 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ మధ్య ప్రభుత్వానికి తెలియజేయకుండా అమెరికా పర్యటన చేశారని మూడో అభియోగం నమోదు చేసింది.

4. సీఐడీ చీఫ్‌గా బాధ్యతల్లో ఉండగా, 2022 డిసెంబర్ 14న జార్జియా వెళ్తున్నట్లు చెప్పి, యూఏఈకి వెళ్లినట్లు తేలిందని తెలిపింది.

5. 2021 అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా యూఏఈలో పర్యటించారని మరో ఆరోపణ చేసింది.

6. 2019 డిసెంబర్ 21న అమెరికా వెళ్లేందుకు అనుమతి తీసుకుని, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వెళ్లారని ఆరో అభియోగంలో పేర్కొన్నారు.

 

ఈ ఆరు అభియోగాలకు సంబంధించి, ప్రతిదానికి విడివిడిగా 30 రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని సునీల్ కుమార్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా, ఈ అభియోగాలపై జరిగే విచారణ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడానికి ప్రయత్నించినా, అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

2019 అక్టోబర్ 24 నుంచి 2023 జనవరి 23 వరకు సీఐడీ చీఫ్‌గా… 2023 మార్చి 10 నుంచి 2024 జూన్ 20 వరకు ఫైర్ సర్వీసెస్ డీజీగా సునీల్ కుమార్ పనిచేశారు. ఈ కాలంలోనే సర్వీసు నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వం అభియోగాలలో పేర్కొంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |