ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ పర్యటన సందర్భంగా తెలంగాణలో జపాన్ దిగ్గజ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా, ప్రఖ్యాత తోషిబా కార్పొరేషన్ (Toshiba Corporation) అనుబంధ సంస్థ తెలంగాణలో కొత్తగా రూ.562 కోట్ల భారీ పెట్టుబడితో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో భాగంగా ఈ భారీ పెట్టుబడిని రాబట్టింది.
జపాన్‌కు చెందిన మల్టీనేషన్ దిగ్గజం తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన, తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టీటీడీఐ) (Toshiba Transmission & Distribution Systems (India) Pvt Ltd) రూ.562 కోట్లతో సంగారెడ్డి జిల్లా రుద్రారంలో కొత్త ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులను, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందం ద్వారా ముందడుగు వేసింది. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, టీటీడీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫురుటా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఒప్పందం ప్రకారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. అదే విధంగా, పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీలను ఆధునీకరించనుంది. ఈ ప్రాజెక్టు కోసం తోషిబా సంస్థ రూ.562 కోట్ల పెట్టుబడి కేటాయించనుంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే కాక, గణనీయమైన ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది.
రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీటీడీఐ, ఈ కొత్త పెట్టుబడితో మూడవ ఫ్యాక్టరీని నెలకొల్పడంతో పాటు, ప్రస్తుత ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఈ ఒప్పందం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక పరివర్తనలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని, పరిశ్రమల భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారాల ద్వారా ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని, తోషిబాతో ఈ ఒప్పందం పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు.
టీటీడీఐ చైర్మన్ హిరోషి ఫురుటా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు తమను ఆకర్షించాయని, ఆవిష్కరణల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధత తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిందని, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు.
టోక్యో వాటర్ ఫ్రంట్ పరిశీలించిన రేవంత్ టీమ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్‌లోని టోక్యో వాటర్ ఫ్రంట్ (Tokyo Waterfront) ను సందర్శించింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
టోక్యో నగరం మధ్యన జల రవాణాకు అనుగుణంగా రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడం, సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చిందీ ఈ ప్రతినిధి బృందం పరిశీలించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టోక్యో రివర్ ఫ్రంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది.
హైదరాబాద్‌లో 10 వేల కోట్లతో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్
జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రాష్ట్రానికి మరో రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఐటీ సేవల్లో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఎన్‌టీటీ డేటా (NTT DATA Group Corporation), అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్‌వర్క్స్ (Neysa Networks Pvt Ltd)లు సంయుక్తంగా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ (AI Data Center Cluster in Hyderabad) ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రూ.10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్‌ను నిర్మించేందుకు త్రైపాక్షిక ఒప్పందం (MoU) కుదిరింది.
టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్స్‌ల నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎన్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బాజ్‌పాయ్, నెయిసా సీఈవో, ఎన్‌టీటీ గ్లోబల్ డేటా ఛైర్మన్ శరద్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు.









