ఎస్సీ వర్గీకరణపై ఉపకులాలకు వర్తించే రిజర్వేసన్లను నిర్వచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గురువారం ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, శుక్రవారం ఎస్సి వర్గీకరణ రిజర్వేషన్ నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లో వర్గీకరణ ప్రాతిపదికన రిజర్వేషన్ వర్తిస్తుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్ లాగ్ ఖాళీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపు ఉంటుందని తేల్చి చెప్పింది.
మూడు కేటగిరీలుగా ఉప కులాల వర్గీకరణ కింద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసింది. మొదటి గ్రూప్‌లోని రెల్లి సహా 12 ఉప కులాలకు 1 శాతం చొప్పున రిజర్వేషన్, 2వ గ్రూప్లో మాదిగ సహా 18 ఉప కులాలకు 6.5 శాతం రిజర్వేషన్ , 3వ గ్రూప్‌లోని మాల సహా 29 ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్లుగా పేర్కొంది. మొత్తంగా ఎస్సీ వర్గీకరణ కింద 15 శాతం రిజర్వేషన్ కల్పించేలా నిబంధనలు జారీ చేసింది.
మొత్తం 200 రోస్టర్ పాయింట్ల అమలుకు నిర్ణయించింది. ఉద్యోగాల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు ఈ 3 కేటగిరిల్లోనూ వర్తిస్తుందని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. నోటిఫికేషన్ల సమయంలో అర్హులైన అభ్యర్ధులు లేకపోతే తదుపరి నోటిఫికేషన్‌కు ఆ ఖాళీలు బదలాయిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ నిబంధనల అమలుకు నోటిఫికేషన్ను సీఎస్ కే విజయానంద్ జారీ చేశారు. 1వ గ్రూప్‌లో రెల్లి సహా 12 ఉప కులాలకు 1 శాతం చొప్పున రిజర్వేషన్, 2వ గ్రూప్లో మాదిగ సహా 18 ఉప కులాలకు 6.5 శాతం రిజర్వేషన్, 3వ గ్రూప్లో మాల సహా 29 ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.









