లిక్కర్ స్కామ్ వైసీపీని కుదిపేస్తుందా? ఈ వ్యవహారంలో కీలక నేతలు సిట్‌కు చిక్కినట్టేనా? కసిరెడ్డిని పట్టుకుంటే కేసు ఓ కొలిక్కి వస్తుందా? నిన్నటి వరకు ముందస్తు బెయిల్‌పై పిటిషన్లు వేసిన కసిరెడ్డి ఎక్కడ? ఇంతకీ ఇండియాలో ఉన్నాడా? విదేశాలకు చెక్కేశాడా? కసిరెడ్డి ఆఫీసు, ఇళ్లు సోదాల వెనుక అసలు కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
వైసీపీ హయంలో లిక్కర్ స్కామ్ భారీ ఎత్తున జరిగిందని పదేపదే కూటమి ప్రభుత్వం చెబుతోంది. లిక్కర్ షాపుల్లో ఆన్‌లైన్ ట్రాన్స్ యాక్షన్ల పక్కనపెట్టేసి, కేవలం ఆఫ్‌లైన్ మీద కొనసాగించారు. దీనివెనుక కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం మాట. దీనిపై రంగంలోకి దిగిన సిట్, క్రమంగా వివరాలు సేకరించింది.
ఆ మధ్య వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సైతం లిక్కర్ స్కామ్ వెనుక కసిరెడ్డి కీలకపాత్ర పోషించాడని ఓపెన్‌గా బయటపెట్టారు. దీంతో సిట్ టీమ్ అటువైపు దృష్టిపెట్టింది. ఈ క్రమంలో తీగలాగితే డొంక అంతా కదిలింది. లిక్కర్ ద్వారా రాబట్టిన సొమ్మును మూడు విభాగాల్లో పెట్టుబడులు పెట్టాడట కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.
సినిమాలు, ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్ మీద బినామీ పేర్లతో ఇన్వెస్ట్‌మెంట్ చేశాడట కసిరెడ్డి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు సోదాలు నిర్వహించారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
స్కామ్‌లో కింగ్ పిన్‌గా భావిస్తున్న జగన్ బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం అధికారులు విస్తృతంగా గాలింపు మొదలుపెట్టారు. కసిరెడ్డి అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన తప్పించుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన సిట్.. సోమవారం హైదరాబాద్‌లోని రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కసిరెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. అలాగే కసిరెడ్డి బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్లలో 15 చోట్ల సోదాలు చేసినట్టు సమాచారం. కసిరెడ్డి భార్య డైరెక్టర్‌గా ఉన్న రాయదుర్గంలోని అరేటి ఆసుపత్రి, ఆయన అత్త ఇళ్లలో సోదాలు జరిగాయి. మంగళవారం కూడా సోదాలు కొనసాగించనున్నారు సిట్ అధికారులు.
ఉన్నట్లుండి సిట్ సోదాలు చేయడంతో బినామీల్లో గుబులు మొదలైంది. సిట్ అధికారులు తమకు ఎక్కడ అదుపులోకి తీసుకుంటారేమోనని బెంబేలెత్తుతున్నారు. ఈ పెట్టుబడుల వెనుక వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు నిర్మాతల ద్వారా పెట్టుబడి పెట్టి పెద్ద సినిమాలు శ్రీకారం చుట్టినట్టు అంతర్గత సమాచారం.
హైదరాబాద్‌లో కీలకమైన నాలుగు ఆసుపత్రుల్లో బినామీ ద్వారా పెట్టుబడి పెట్టినట్టు ప్రభుత్వ వర్గాల మాట. రియల్ ఎస్టేట్ విభాగంలో గత ప్రభుత్వ హయాంలో కీలక ప్రాజెక్టులు ఆ కంపెనీకి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ మూడు విభాగాల్లో బ్లాక్ మనీ వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలీదని అంటున్నారు. నేపాల్ మీదుగా ఆయన విదేశాలకు చెక్కేసినట్టు వార్తలు వస్తున్నాయి.
జగన్ బంధువు రాజ్ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఐటీ సలహాదారునిగా కొనసాగారు. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఓ అంచనా. మద్యం తయారీ దారుల నుంచి ప్రతి నెలా రూ.60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.3 వేల కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేర్చినట్లు ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యవహారం తాడేపల్లి వరకు వెళ్తుందని భావించి కీలక నేతలు ఆయన్ని విదేశాలకు పంపించినట్టు సిట్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.