వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హింస కారణంగా ముర్షిదాబాద్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
బెంగాల్‌లో హింస, మరణాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా కోరారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పౌరుల ప్రాణాలను కాపాడేందుకు, హింసను నివారించేలా కోర్టు చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బెంగాల్‌లోని మాల్డా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులు రహదారులను, రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో 200 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.