రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరిగి రాజధాని పనుల ప్రారంభానికి ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆర్దిక పరంగా వనరుల సమీకరణ పూర్తయింది. పనుల రీ లాంఛ్ కు ప్రధాని అప్పాయింట్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం వెయిట్ చేస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి తాజా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణకు సిద్దమయ్యారు. 43 వేల ఎకరాల సమీకరణ ద్వారా అమరావతి భవిష్యత్ కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
పరిధి పెంపు
అమరావతి పరిధి పెరగనుందా. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రాజధానిని విస్తరించాలని ప్రభుత్వ ఆలోచనకు కార్యరూపం ఇస్తున్నారు. దీని కోసం కొత్తగా మరో 44 వేల ఎకరాల భూములను సమీకరణ కింద తీసుకునేందుకు సీఆర్‌డీఏ ప్రతిపాదన రూపొందించింది. అమరావతిలో 92 ప్రాజెక్టులకు గుర్తించి.. రూ.65 వేల కోట్ల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇందు కు దాదాపుగా 5 వేల నుంచి 7 వేల ఎకరాలు అవసరం. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున భూములను తీసుకోవలసి ఉంది. అదే సమయంలో రెసిడెన్షియల్, గ్రూప్ హౌస్‌లు, హైరైజ్ భవనాలు, కమర్షియల్ భవనాలు తదితరాలను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు.
సీఆర్డీఏ నివేదిక
అమరావతి రాజమార్గాలుగా ఈ-13, ఈ-15 రోడ్లను జాతీయ రహదారి-16కు అనుసంధాని స్తున్నారు. గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) లకు అనుసంధానంగా అమరావతి రోడ్లను అనుసంధానించాలి. అమరావతిలో రూ.కోట్లు పలుకుతున్న భూములను భూ సేకరణ ద్వారా సాధ్యం కాదని భావిస్తున్న ప్రభుత్వం భూ సమీకరణకు సిద్దం అవుతోంది. ప్రపంచ బ్యాంకు కూడా మరిన్ని భూములు సమీకరించాలని సూచించినట్లు సమాచారం. రాజధానికి రుణాలు సమకూరుస్తున్న ఈ సంస్థ కొన్ని ప్రయోజనకర ఫలితాలను ఆశిస్తోంది. ఈ కారణంగానే రాజధాని విస్తరణకు మరో 44 వేల ఎకరాలను భూసమీకరణ ద్వారా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికేఎక్కడెక్కడ భూములు సమీకరించాలో కొన్ని ప్రాంతాలను ప్రతిపాదిస్తూ సీఆర్‌డీఏ నివేదిక సిద్దం చేసింది.