నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ లోపాలు తలెత్తడంతో దరఖాస్తు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
ఇంటర్నెట్ సెంటర్లు, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దరఖాస్తు చివరి దశకు చేరుకున్న సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, సాంకేతిక సమస్యల కారణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నట్లుగా చూపిస్తోందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.
దరఖాస్తు సమర్పించిన అనంతరం ఫారం డౌన్‌లోడ్ కావడానికి సైతం అధిక సమయం పడుతోంది. దీంతో దరఖాస్తుదారులు పదే పదే మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14న ముగియనుంది.
స్వంత వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందించనుంది