UPDATES  

NEWS

 మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. 17 మంది ఇంజనీర్లపై ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు..

కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి తవ్వే కొద్ది అక్రమాలు, నిర్లక్ష్యాలు బయట పడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాకు కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ సంస్థ L&T అని విజిలెన్స్ తన నివేదికలో తెలిపింది. ఈ తుది నివేదికను నీటి పారుదల శాఖకు సమర్పించింది. కాంట్రాక్ట సంస్థ నిర్లక్ష్యం, లోపాల వలన ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని.. ఆ నష్టాన్ని ఆ సంస్థ నుంచే పూరించాలని సిఫారుసు చేసింది విజిలెన్స్.

 

బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన సీకెంట్‌ పైల్స్‌ వేయడంలో తీవ్ర లోపం జరిగిందని విజిలెన్స్ ప్రధాన ఆరోపణ. ప్రైమరీ పైల్స్‌ వేసిన ఒకటి లేదా రెండు రోజుల్లో ఆర్‌సీసీ సీకెంట్‌ పైల్స్‌ వేయాలి. కానీ.. నెల నుంచి నెలన్నర తర్వాత వేశారని తేల్చింది. సీకెంట్‌ పైల్స్‌ ఎలా వేయాలన్నదానిపై ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ఓ అవగాహన ఉంది.. ఆ సంస్థ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ కూడా ఉందని విజిలెన్స్ వివరించింది. కానీ.. ఆ డాక్యూమెంట్ ను ఫాలో అవ్వలేదని ఆరోపించింది. ఇంత జరుగుతున్నా నీటిపారుదల శాఖకు చెందిన ఫీల్డ్‌ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు కూడా పట్టించుకోలేదని విజిలెన్స్ వివరణ.

 

సీకెంట్‌ పైల్స్‌‌పై ఫీల్డ్‌ ఇంజినీర్లకు అవగాహన లేదని.. కనీసం ఉన్నతస్థాయి ఇంజినీర్లు పర్యవేక్షణ జరిపినా ఇంత నష్టం జరిగి ఉండేదని కాదని తెలిపింది. సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో లోపం వల్ల రాఫ్ట్‌ కింద పైపింగ్‌ ఏర్పడి ఆ తర్వాత గుంతలు ఏర్పడ్డాయని.. దీంతో ఏడో బ్లాక్‌ కుంగిందని విజిలెన్స్‌ తుది నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమైన నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏడో బ్లాకు స్థానంలో కొత్తది నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలని సిఫారుసు చేసింది.

 

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి మొత్తం 15 రకాలు గుర్తించామని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పేర్కొంది. డిజైన్లు, సీకెంట్‌ పైల్స్‌ ఏర్పాటు, పని పూర్తయ్యాక కాఫర్‌ డ్యాంకు సంబంధించిన మెటీరియల్‌ తొలగించకపోవడం జరిగిందని దర్యాప్తు సంస్థ తెలిపింది. పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం, గడువు పొడిగింపులో లోపాలు ఇలా అనేక అంశాలను తుది నివేదికలో విజిలెన్స్ సంస్థ వివరణాత్మకంగా పేర్కొంది. వివిధ విభాగాల్లో కీలకమైన 17 మంది ఇంజినీర్లు, వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టర్‌పై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేయడంతోపాటు మిగిలిన వారిపై తప్పు స్వభావాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది.

 

ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థ కలిసి ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బ తీశారని విజిలెన్స్‌ ఆరోపిస్తోంది. పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్లు మంజూరు అయ్యాయని గుర్తించింది. బ్యారేజీకి మరమ్మతులు చేయకున్నా పట్టించుకోకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చిందని తెలిపింది. ఇలాంటి నిర్మాణ పనుల్లో పరిపాలనా అనుమతి ఇచ్చిన దానికన్నా డీవియేషన్‌ అదనంగా పెరిగితే ప్రభుత్వానికి సమాచారమిచ్చి మరో 15 శాతం వరకు చీఫ్‌ ఇంజినీరే అనుమతులు ఇవ్వొచ్చు. కానీ.. మొదటిసారి సవరించిన అంచనా ఆమోదం పొందకముందే ప్రభుత్వానికి చెప్పకుండా చీఫ్‌ ఇంజినీర్‌ 15 శాతం డీవియేషన్‌కు ఆమోదం ఇచ్చారని గుర్తించింది విజిలెన్స్. అంచనాలో లేని పనులను చేసి బిల్లులు పొందారని, కొన్ని మంజూరు చేసిన క్వాంటిటీస్‌ కన్నా ఎక్కువ చేసి బిల్లులు తీసుకొన్నారని తేల్చింది.

 

2015 ఏప్రిల్‌ నుంచి 2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నాటి వరకు నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా సెక్రటేరియట్‌లో బాధ్యులైన అధికారులందరిపైనా తగు చర్యలు తీసుకోవాలని.. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసే పేరుతో అనేక నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. ఆర్థిక శాఖలో కూడా కార్యదర్శులపైనే కాకుండా ఇతర సీనియర్‌ అధికారులపై కూడా చర్య తీసుకోవాలని సూచించింది. ఇందులో 2015 ఏప్రిల్‌ 15 నుంచి 2023 అక్టోబరు 21 వరకు పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంది. కొందరు అధికారులపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేయగా.. కొంత మంది ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ సిఫార్సు చేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |