దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. కేంద్రంలోని బీజేపీ సౌత్ రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోందని ప్రాంతీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు చెన్నై వేదికగా సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశా నికి ప్రాంతీయ పార్టీలు సైతం హాజరయ్యారు. జనాభా ప్రాతిపదిక వ్యతిరేకించాలని నిర్ణయించారు ఆయా పార్టీలు. తాజాగా ఈ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
త్రిభాషా విధానంలో హిందీని నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదన్నారు పవన్ కల్యాణ్. భాషను బలవంతంగా రుద్దడాన్ని తాను ముమ్మాటికీ వ్యతిరేకిస్తానన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తన మనసులోని అభిప్రాయాలను బయటపెట్టారు. ఏపీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో త్రిభాషా విధానం ఉందన్నారు. భాషా విధానాల్లో హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదన్నారు. నచ్చిన భాషలు నేర్చుకోవచ్చని వెల్లడించారు.
తాను త్రిభాషా విధానంలో పెరిగానని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలుసని చెబుతూనే, హిందీ నేర్చుకున్న తర్వాత తెలుగుకు మరింత దగ్గర అయ్యానని మనసులోని మాట బయటపెట్టారు. ఏ భాష అయినా బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. త్రిభాషా విధానంలో అదనపు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందనే కోణంలో చూడాలన్నారు.
తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిభాషా విధానం, డీలిమిటేషన్ వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి భాషకు గౌరవం దక్కాల్సిందేనన్నారు పవన్ కల్యాణ్. భాషను, సంస్కృతాన్ని ప్రారంభించడం తన మార్గ దర్శకాల్లో ఒకటన్నారు. ఏపీ- 400 ఉర్దూ, ఒరియా-107, కన్నడ-57, తమిళ-30, సంస్కృతం-5, తెలుగు మీడియం స్కూల్స్ 37 వేలకు పైగా ఉన్నాయని తెలిపారు.
మాతృభాషపై ఎవరి ప్రేమ వారికి ఉండడం సహజమన్నారు. హిందీ వల్ల తమిళ భాషకు ముప్పు ఉందనే వాదనపై స్పందించారు. ఏ భాషనూ బలవంతంగా రుద్ద కూడదన్నారు. అలా జరిగితే తొలుత తాను వ్యతిరేకిస్తానన్నారు. తమిళం నేర్చుకోవాలని ఎవరు తనను ఒత్తిడి చేయలేదని, తనకు తానే నేర్చుకున్నానని గుర్తు చేశారు.
ఎక్కడో ఉన్న ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లేని భయం.. హిందీకి ఎందుకని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు భాషలు హిందీతో కనుమరుగయ్యాయనే వాదనను తోసిపుచ్చారు. అటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు వాదనపై రియాక్ట్ అయ్యారు. ఈ అంశంపై తొలుత పార్లమెంటు సమావేశాల్లో పోరాడాలన్నారు. దీనిపై రోడ్ల మీదకు వస్తే ఎలా అని ప్రశ్నించారు.
ఒకవేళ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదన్నారు. లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని తాను ఏమాత్రం అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు పవన్. ఏపీని దాటి జనసేన విస్తరించాలని భావిస్తున్నారా? తమిళనాడుకు వచ్చే అవకాశముందా? అన్న ప్రశ్నకు తనదైనశైలిలో చెప్పుకొచ్చారు.
తనకు అలాంటి ఉద్దేశం లేదన్నారు. తమిళనాడులో బీజేపీ ఎదిగే ఛాన్స్ ఉందా ప్రశ్నకు వెరైటీగా రిప్లై ఇచ్చారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చన్నారు. తొలుత కాంగ్రెస్‌ను దక్షిణాదిలో అన్నాదురై ఓడించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.