UPDATES  

NEWS

 లద్దాఖ్‌ భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా.. మండిపడిన భారత్‌..

చైనా దుందుడుకు వ్యవహారాలపై భారత్ మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్తో సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలు జరుగుతున్న సమయంలో, చైనా మరోసారి వివాదాస్పద చర్యలకు పాల్పడింది. లద్దాఖ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాలను కూడా ఉల్లంఘించి, కొత్త కౌంటీలను ఏర్పాటు చేస్తోంది. ఇటీవల చైనా రెండు కొత్త కౌంటీలను సృష్టించింది, వీటిలో కొంత భాగం భారత్ లోని లద్దాఖ్ పరిధిలో ఉంది. ఈ విషయంపై భారత్ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది మరియు ఇలాంటి దురాక్రమణలను ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేసింది.

 

ఈ విషయంపై భారత్ బలమైన నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు పార్లమెంటులో తెలియజేయబడింది. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో, విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందిస్తూ, భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదని, ఆ దేశం యొక్క కొత్త కౌంటీల ఏర్పాటు భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన దీర్ఘకాలిక వైఖరిని ప్రభావితం చేయదని తెలిపారు. చైనా చేస్తున్న చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలను భారత్ చట్టబద్ధం చేయబోదని కూడా స్పష్టం చేశారు.

 

లద్దాఖ్ లోని భారత భూభాగాన్ని కలుపుకుని, చైనా హోటాన్ ప్రావిన్స్ లో రెండు కొత్త కౌంటీలను సృష్టించడం గురించి ప్రభుత్వానికి తెలుసా? అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ వ్యూహాత్మక, దౌత్యపరమైన చర్యలు తీసుకుందో తెలపాలని సంబంధిత మంత్రిత్వ శాఖను అడిగినప్పుడు, సింగ్ ఈ సమాధానం ఇచ్చారు.

 

చైనాలోని హోటాన్ ప్రావిన్స్ లో రెండు కొత్త కౌంటీల ఏర్పాటుకు సంబంధించి చైనా చేసిన ప్రకటన గురించి భారత ప్రభుత్వానికి తెలుసని, ఈ కౌంటీల అధికార పరిధిలోని కొన్ని ప్రాంతాలు భారతదేశంలోని లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోకి వస్తాయని సింగ్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాలలో చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని కూడా ప్రభుత్వానికి తెలుసునని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం దీనిని నివారించేందుకే సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, తద్వారా భారత్ తన భద్రతా అవసరాలను వ్యూహాత్మకంగా మెరుగుపరుచుకుంటుందని తెలిపారు.

 

“భారత సరిహద్దుల్లో రెండు కొత్త కౌంటీలను చైనా ఏర్పాటు చేస్తున్న విషయం మాకు తెలిసింది. ఆ కౌంటీల్లోని కొన్ని భాగాలు లద్దాఖ్ పరిధిలోకి వస్తాయి. భారత భూభాగాలను ఆక్రమించడాన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోము. భారత సార్వభౌమాధికారానికి సంబంధించి మా దీర్ఘకాలిక, స్థిరమైన వైఖరిపై ఈ కౌంటీల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపించదు. ఈ చర్యలు చైనా బలపూర్వకంగా ఆక్రమించుకున్న ప్రాంతాలకు చట్టబద్ధతను కల్పించలేవు” అని మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పార్లమెంట్ కు వెల్లడించారు. ఈ విషయంపై భారత్ తన నిరసనను దౌత్యమార్గాల ద్వారా చైనాకు తెలియజేసిందని కూడా పేర్కొన్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |