ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఆధ్యాత్మిక నగరం తిరుపతి, సాగర నగరం విశాఖపట్నంలలో మాల్స్ ఏర్పాటు చేసేందుకు లులు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. నిజానికి 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నం సాగర తీరంలో లులు మాల్‌కు స్థలం కేటాయించింది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అది కాస్త హైదరాబాద్‌కు తరలిపోయింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి వచ్చేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. వైజాగ్‌లో మాల్ ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమ్మతి తెలియజేసింది. దానికి కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలిపింది.
కాగా, రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పునఃప్రారంభించబోతున్నట్టు ఇటీవల ప్రభుత్వం తెలిపింది. ఇదే విషయాన్ని మంత్రివర్గానికి తెలియజేశారు. ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధానితోపాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా చంద్రబాబు కలుస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల జాబితాను తీసుకెళ్లనున్నారు. వాటికి నిధులు విడుదల చేయాల్సిందిగా నిర్మలను కోరనున్నారు.