పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన కుటుంబ సభ్యులతో సహా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. పెండెం దొరబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని పెండెం దొరబాబు చెప్పగా, పవన్ కల్యాణ్ అందుకు ఆమోదం తెలిపారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభలో దొరబాబు జనసేన కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
పెండెం దొరబాబు 1999లో బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1999 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన… 2004 ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు.
రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైసీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో దొరబాబుకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో వంగా గీతకు టికెట్ ఇవ్వగా… ఆమె పవన్ కల్యాణ్ చేతిలో ఓడిపోయారు.