UPDATES  

NEWS

 విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శుభవార్త..! ఆ నిబంధన ఎత్తివేత..

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇన్నాళ్లూ వున్న ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రేపటి (5వ తేదీ) నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. 9.05 గంటలకు వచ్చినా విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. 8.45 గంటల నుంచి 9 గంటల వరకు ఓఎంఆర్ పత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

 

ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించడంతో దానిని స్కాన్ చేయడం ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే, ప్రశ్నపత్రంపై సీరియల్ నంబర్ ముద్రించడంతో ఏ పేపర్ ఏ విద్యార్థికి వెళుతుందన్నది సులభంగా గుర్తించవచ్చు. దీనివల్ల పేపర్ లీకైనా ఏ పరీక్ష కేంద్రం నుంచి, ఏ విద్యార్థి ద్వారా బయటకు వచ్చిందన్న వివరాలు తెలిసిపోతాయి.

 

ప్రశ్నపత్రంలో ఏవైనా పొరపాట్లు ఉంటే పరీక్ష ప్రారంభమైన తర్వాత సవరించుకుని ఆ మేరకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈసారి చేతి గడియారాలను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష కేంద్రాలన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాకు ఒక్కో స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 75 మంది పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తారు.

 

ఈసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలుపుకొని మొత్తం 4,97,528 మంది అబ్బాయిలు పరీక్ష రాస్తుండగా; 4,99,443 అమ్మాయిలు పరీక్ష రాయబోతున్నారు. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య 1,915 మంది అధికం. పరీక్షకు ముందు మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు గురైతే టోల్‌ఫ్రీ నంబర్ 14416కు కానీ, బోర్డు కార్యాలయంలోని హెల్ప్‌లైన్ నంబర్ 92402 05555కు కానీ ఫోన్ చేయవచ్చు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |