UPDATES  

NEWS

 త్వరలో ఏపీకి 5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు..

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకు వచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో మంత్రి సవిత రెండో రోజు సోమవారం కూడా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న పలువురు దేశ, విదేశ పెట్టుబడుదారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల గురించి, చేనేత రంగంలో అవకాశాల గురించి వారికి వివరించారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో, అడ్వాన్స్ టెక్స్ టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా మరో రెండు సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖం వ్యక్తం చేశారని తెలిపారు.

 

కర్ణాటకకు చెందిన ప్రతినిధులు ఎమ్మిగనూరు టెక్స్‌ టైల్స్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లు మంత్రి సవిత వెల్లడించారు. రష్యాలో టెక్స్‌ టైల్స్ వేర్ హౌస్ ఏర్పాటుకు ఏపీకి చెందిన గుంటూరు టెక్స్‌ టైల్స్ పార్క్ అంగీకారం తెలిపిందని మంత్రి సవిత తెలిపారు.

 

న్యూఢిల్లీలో ఈ నెల 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ విజయవంతమైందని మంత్రి సవిత అన్నారు. 126 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారన్నారు. భారత్ టెక్స్ వల్ల చేనేత రంగంలో పెట్టుబడులకు, చేనేత వస్త్రాల మార్కెటింగ్ కు కొత్త అవకాశాలు లభించాయన్నారు. ‘ఖాదీ ఈజ్ ఏ నేషన్… ఖాదీ ఈజ్ బీకమింగ్ ఫ్యాషన్’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. దేశంలో వ్యవసాయం తరవాత అత్యధికంగా ఆధారపడిన రంగం చేనేత రంగమేనని పేర్కొన్నారు.

 

భారత్ టెక్స్ అందించిన స్ఫూర్తితో త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేలా సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారికి అనువైన వాతావరణం కల్పించారన్నారు. సుస్థిరమైన పాలనతో పాటు రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఏపీలో పలు దిగ్గజ కంపెనీలు పెట్టాయని చెప్పారు. చేనేత రంగంలోనూ పెట్టుబడులు పెట్టేలా సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |