తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ తనను మోసం చేసాడని అరోపణలు చేస్తున్న లక్ష్మీ రెడ్డిని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద లక్ష్మీ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని జైపూర్ కు తరలిస్తున్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా కిరణ్ రాయల్ లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్న లక్ష్మీ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
కిరణ్ రాయల్ లక్ష్యంగా లక్ష్మీ పలు ఆరోపణలు చేశారు. తనకు సుమారు కోటి పైగా డబ్బులు ఇవ్వాలంటూ ఆమె ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు కొన్ని వీడియోలను కూడ ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడ వైరల్ గా మారాయి. అయితే ఈ ఆరోపణలను కిరణ్ రాయల్ కొట్టి పారేశారు. ఇటీవల తాను జగన్ చేసిన 2.ఓ కామెంట్స్ పై చిట్టి జగన్ అంటూ రోబో ప్లకార్డులను ప్రదర్శించినందుకే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. అలాగే తిరుపతి పోలీసులకు కూడ కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. ఇలా ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనితో జనసేన పార్టీ స్పందించింది. కొద్దిరోజులు పార్టీకి దూరంగా ఉండాలని, అలాగే అనవసర విషయాల కంటే, పార్టీ అంశాలపై దృష్టి సారించాలని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.
అంతలోనే మరోమారు కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసేందుకు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ కు లక్ష్మీ రెడ్డి వచ్చారు. మీడియాతో అలా మాట్లాడి బయటకు వచ్చారో లేదో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అది కూడ జైపూర్ పోలీసులు కావడం విశేషం. లక్ష్మీ రెడ్డి పై పలు రాష్ట్రాలలో పలు కేసులు నమోదై ఉన్నాయని కిరణ్ రాయల్ పలు మార్లు ఆరోపించారు. ఆయన చెప్పినట్లుగానే జైపూర్ పోలీసులు, లక్ష్మీ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం విశేషం. ప్రెస్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు.. యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జైపూర్ లో నమోదైన ఆర్థిక నేరం కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. తన అరెస్ట్ పై లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ.. తనపై సైబర్ కేసు నమోదై ఉందని, అందుకే తనను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. తనను, తన పిల్లలను కిరణ్ రాయల్ వేధిస్తున్నాడని మరోమారు ఆరోపణలు చేశారు. కాగా 2021 లో జైపూర్, చాంద్వాజి పోలీసు స్టేషన్ లో లక్ష్మి రెడ్డి తో పాటు, అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ ఆలయస్ ఘని అనే ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
419, 420, 66C, 66D, 120-B, 406 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, గతంలోనే అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ ఆలయస్ ఘని అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న లక్ష్మి రెడ్డి గత మూడు రోజులుగా కిరణ్ రాయల్ వ్యవహారంలో మీడియా లో కనిపించడంతో జైపూర్ నుంచి పోలీసులు తిరుపతికి వచ్చారు. యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో హాజరు పరిచి, తిరిగి జైపూర్ కి తీసుకుని వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఒక వివాదం పోయి మరో వివాదం లక్ష్మీ రెడ్డి చుట్టుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.