ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. మూడు పార్టీలు శక్తి వంచన లేకుండా గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నాయి. తిరిగి అధికారం దక్కించుకోవటం కోసం కేజ్రీవాల్ ఇతర పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ తమకు కలిసి వస్తుందనే ధీమాతో ఉంది. కాగా, బీజేపీ మాత్రం గెలుపు ఖాయమనే విశ్వాసంతో కనిపిస్తోంది. అయితే, ఢిల్లీ ఓటర్ పల్స్ మాత్రం క్లియర్ గా ఉంది.
త్రిముఖ పోరు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సర్కార్ నుంచి అధికారం దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఈ సారి ఆశలు పెంచుకుంది. ఇక్కడ పార్టీల మేనిఫెస్టోలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మహిళలకు మూడు పార్టీలు ప్రాధాన్యత ఇచ్చాయి. ఏ పార్టీ గెలిచిన మహిళల ఖాతాల్లో నగదు జమ పైన హామీ ఇచ్చాయి. మహిళా, యువత ఓటర్లను ఆకట్టుకోవటానికి బీజేపీ – ఆప్ పోటీ పడుతున్నాయి. ఎస్సీ – దళిత ఓట్ బ్యాంక్ ను తమ వైపు తిప్పుకునేందుకు ఆప్ – కాంగ్రెస్ మధ్య పోటీ కనిపిస్తోంది.
ఆ 30 నియోజకవర్గాల్లో
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వుడ్ సీట్లు, మెజారిటీ దళిత ఓట్లు ఉన్న 30 నియోజక వర్గాలు గెలుపులో కీలకంగా మారుతున్నాయి. ఈ సీట్ల పైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ దృష్టి సారించా యి. ఎస్సీ నియోజకవర్గాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్, ఆప్ లెక్కలు వేస్తోంది. 2015, 2020 దిల్లీ శాసనసభ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ 2-3 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీంతో ఈ సారి ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ ను దెబ్బ తీస్తే అధికారం తమదేనని అంచనా వేస్తోంది. ఇందు కోసం ఏరి కోరి ఎంపిక చేసిన నేతలను రంగంలోకి దించుతోంది.
ప్రచారం ముమ్మరం
ఢిల్లీలో దళిత ఓటర్లు ఈ 30 నియోజకవర్గాల్లో దాదాపు 30 శాతం వరకు ఉన్నారు. ఆప్ ను ఈ 30 నియోజకవర్గాల్లో నిరోధించ కలిగితే.. తమ గెలుపు సునాయాసమని భావించిన బీజేపీ ఎస్సీ నేతల కు ఇక్కడ బాధ్యత అప్పగించింది. ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో 10 మందిని నియమించి ప్రతీ ఓటరును కలిసేలా ప్లాన్ చేసారు. పొరుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి చెందిన ముఖ్యమైన ఎస్సీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ స్వాభిమాన్ సమ్మేళన్ నిర్వహిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ సైతం ఇక్కడే గురి పెట్టింది. దీంతో, మూడు పార్టీల మధ్య సాగుతున్న త్రిముఖ పోరులో ఢిల్లీ ఓటర్ మూడ్ పైన ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో..పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేసాయి. తుది ఫలితం పైన ఆసక్తి నెలకొంది.