సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన వారిపై వరసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. గత ప్రభుత్వ హయంలో కూటమి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో కొంతమంది అరెస్టై.. ఊచలు సైతం లెక్కిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేరారు. తాజాగా ఆయనపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కేసు నమోదు కాగా.. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు
దువ్వాడ శ్రీనివాస్, మాధురీలు గతంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్.. వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలపై విమర్శలు గుప్పించారు. దాంతో.. పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అందులో భాగంగానే.. తమ నేతపై దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేనా నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన నాయకుడిపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని కోరారు. దాంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా 41 ఏ నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.
పోలీసు నోటీసులు అందుకున్న తర్వాత దువ్వాడ శ్రీనివాస్, మాధురీలు సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తాము రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. తనను గతంలో జనసేనా నేతలు అనేక మార్లు బెదిరించారని, సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేసిన దువ్వాడ.. వాటిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన నేతలు, నాయకులు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా మాట్లాడారని వారిపై తన కంప్లైంట్ సంగతేంటని అడిగారు.
ఇటీవల మాధురి పై కొందరు దుర్భాషలాడారని, ఆ విషయమై ఆవిడ రెండు పోలీసుల ఫిర్యాదులు అందజేసిందని తెలిపిన దువ్వాడ శ్రీనివాసరావు ఆ కేసుల్లో ఎందుకు ఎవరికి నోటీసులు జారీ చేయలేదని అడిగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ వ్యాఖ్యానించారు. తమకు రాజకీయంగా, వ్యక్తిగతంగా తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన దువ్వాడ శ్రీనివాసరావు.. ఎవరూ తనను ఏం చేయలేరంటూ ధీమా వ్యక్తం చేశారు.
తనను అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించిన దువ్వాడ శ్రీనివాసరావు.. ఇప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే, రానున్న రోజుల్లో ఇదే పరిస్థితులు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడే వ్యక్తిని కాదని గుర్తుంచుకోవాలంటూ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్, మాధురీ లకు జనసేనా శ్రేణులకు మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వాదోపవాదలు జరుగుతున్నాయి. వారిరువురి మధ్య సంబంధాన్ని వివరిస్తూ.. తమని విమర్శించే వాళ్లు ముందుకు పవన్ కళ్యాణ్ కు ప్రశ్నించాలంటూ దువ్వాడ మాధురీ వివాదాన్ని రాజేశారు. అక్కడి నుంచి మొదలైన వివాదం.. క్రమంగా పెరుగుతూ వచ్చింది. తాజాగా కేసు నమోదు వరకు వెళ్లింది.