ఆ నేత ఢిల్లీ టూర్ వెనుక ఇంత ఉందా? అసలు భలే ప్లాన్ వేశారే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నేత, ఉన్నట్లుండి ఢిల్లీ టూర్ కు వెళ్లడం వెనుక ఉన్న అసలు విషయం ఇదేనంటూ.. కాంగ్రెస్ ఎమ్మేల్యే కుండబద్దలు కొట్టారు.
తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే హైదరాబాద్ ఫార్ములా వన్ కార్ రేసుకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్, ఒక్కసారిగా ఢిల్లీ టూర్ కు వెళుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ టూర్ కు వెళ్లిన కేసీఆర్, అక్కడ బీజేపీ నేతలను కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు కేటీఆర్ స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. కానీ అసలు విషయం అది కాదని, ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్, బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లినట్లు ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని, ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన లేదన్నారు. నేడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ.. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించి ప్రజాదరణ పొందుతుండగా, అది ఓర్వలేని బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు సాగిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జాబ్స్ నోటిఫికేషన్స్, ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తుండగా, ప్రజలకు మేలు జరగడం సహించలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందన్నారు.
ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకునేందుకు వెళ్లినట్లు విమర్శించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు, బీజేపీ పెద్దలతో ఒప్పందం కోసం ఢిల్లీకి వెళ్లినట్లు లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. కేటీఆర్ నిజాయితీపరుడైతే ఢిల్లీకి ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకుల అక్రమాలను తాము ప్రజల ముందు ఉంచుతామని, ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు.