ఏపీలో వరుసగా మహిళళపై చోటు చేసుకుంటున్న అత్యాచారాల విషయంలో పోలీసు వ్యవస్థ స్పందిస్తున్న తీరుపై నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పోలీసులు నిందితులను శిక్షించే విషయంలో కులం చూడటంపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. అనంతపురంలో పోలీసు పరేడ్ కోసం వచ్చిన ఆయన పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇదే తమ విధానం అని డీజీపీ తెలిపారు. తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయబోమన్నారు.వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసు నైనా విచారిస్తామని డీజీపీ తెలిపారు. ఎవరికి ఎంత ప్రొటోకాల్ ఇవ్వాలో అంతే ఇవ్వాలన్నారు. డీజీపీ ఆఫీస్ లో ఇప్పటికే సంతకాలు చేస్తున్న వారిలో ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని, ముగ్గురిని సస్పేండ్ చేశామని డీజీపీ వెల్లడించారు. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
పోలీసులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలి, తాము అదే చేస్తున్నామని పవన్ వ్యాఖ్యలపై డీజీపీ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయని, టీడీపీ కార్యాలయం పై దాడి చేస్తే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని గుర్తుచేసారు. నేరస్తుల వేలిముద్రలు గుర్తించే సిస్టం లేకుండా చేశారన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అన్నది చూడాలన్నారు.
ఒక ఎంపీని కొట్టారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపై నిజానిజాలు తేలలేదన్నారు. ఇటీవల సైబర్ క్రైమ్, సోషల్ మీడియా వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. వీటిని పూర్తిస్థాయిలో నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చట్టానికి రాజ్యాంగానికి లోబడే తాము పని చేస్తున్నామన్నారు.