కులగణన పై కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి చేపట్టనున్న కులగణన సర్వేపై అన్ని వర్గాల వారి ఆలోచనలు తీసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించనున్న విధివిధానాల గురించి తెలుసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి చేరుకున్నారు. ఇప్పటికే.. బేగంపేట చేరుకున్న రాహుల్ గాంధీ.. బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో నిర్వహించనున్న మీటింగ్ కు హాజరు కానున్నారు.
కులగణనతో బలహీన వర్గాల వారిని అందనున్న ప్రయోజనాల్ని వారికి వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఈ మీటింగ్ తర్వాత రాహుల్ ఎలాంటి మార్పు చేర్పులు సూచిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే.. మీటింగ్ కు హాజరయ్యేందుకు వివిధ వర్గాల వారితో పాటు, కాంగ్రెస్ నాయకత్వం మొత్తం పాల్గొననుంది.
కుల గణనపై తెలంగాణాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. చట్ట, న్యాయ పరంగా ఎలాంటి అడ్డుకులు ఎదురైనాయ.. గంటల వ్యవధిలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి.. వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు.. ఈ ప్రక్రియలో అతిపెద్ద మలుపుగా రాహుల్ పర్యటనను చూస్తున్నారు. తెలంగాణా ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగా రాహుల్ తెలంగాణాలో కులగణన పై ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఈ కులగణన సర్వేను ఓ మోడల్ ప్రాజెక్టుగా ప్రారంభించి.. ఆ తర్వాత మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల సమయంలో దేశమంతా పాదయాత్ర చేసిన రాహుల్ గాందీ.. దేశంలోని వనరులు, సంపదలను సమాన స్థాయిలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కుల గణన జరగాలని విశ్వసించారు. అందుకు తగ్గట్టే.. తెలంగాణ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అప్పుడే ప్రకటించారు. అందుకు తగ్గట్టే ఇప్పుడు.. ఈ కార్యక్రమాన్ని పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.
కుల గణనపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. దాన్ని జీవోగా విడుదల చేసింది. కుల గణన సర్వేలో సమాజంలోని అన్ని వర్గాలకు చేరువకానున్న అధికారులు.. ప్రజల్ని ఏ ప్రశ్నలు అడగాలి.? ఏ సమాచారం సేకరించాలి.? వంటి అంశాలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ తెలంగాణ నేతలు, మేధావులు, సామాజికవేత్తలతో సంప్రదింపులు జరుపనున్నారు.