ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లకు మళ్లీ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ స్మార్ట్ కార్డుల జారీని నిలిపేశారు. దీంతో వాహనదారులు జిరాక్స్ కాపీలనే తీసుకుని వాడుకోవాల్సి వచ్చేది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో ఈ సమస్య ఎదురైంది.
వాస్తవానికి ప్రతీ వాహనం కొనుగోలు చేసినప్పుడు దానికి ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇవే వివరాలతో స్మార్ట్ కార్డుల్ని ముద్రించి వాహనదారులకు అందిస్తారు. ఇందుకు గాను రూ.200 వాహనం కొనుగోలు సమయంలోనే వసూలు చేస్తారు. కానీ ఇలా డబ్పులు వసూలు చేసినా వైసీపీ ప్రభుత్వంలో కార్డులు మాత్రం జారీ చేయలేదు. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కోసం కూడా ఇదే తంతు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి డ్రైవింగ్ లైసెన్స్ లతో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కూడా స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో వచ్చే వారం నుంచే ఆన్ లైన్ లో ఆప్షన్ తీసుకుని కార్డులు జారీ చేయబోతున్నారు. నవంబర్ నుంచి ఇలా స్మార్ట్ కార్డులు జారీ చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రతీ ఏటా ఇలా సుమారు 36 లక్షల స్మార్ట్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. దీంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వీటి జారీకి ఆదేశాలు జారీ చేయబోతున్నారు.