ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు, వాటి విస్తీర్ణం ఎంత ఉందో నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులు, పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
సరస్వతి పవర్ సంస్థకు 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వెలుగు చూసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ అధికార యంత్రాంగంతో చర్చించారు. ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు ఏ మేరకు ఉన్నాయో తెలియజేయడంతోపాటు, అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
సంస్థకు పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో తెలియజేయాలని డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ పీసీబీని ఆదేశించారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో ఉప ముఖ్యమంత్రి సమీక్షించనున్నట్లు సమాచారం.
కాగా, సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములు, ఆస్తుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్’కి చెందిన ఆస్తులన్నీ తనకే చెందుతాయంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కోర్టుకెళ్లిన విషయం తెలిసిందే. అప్పట్లో సరస్వతి పవర్ పేరుతో రైతుల నుంచి జగన్ ఎకరా రూ. 3 లక్షల చొప్పున భూములు కొనుగోలు చేశారు. మొత్తం 1,515.93 ఎకరాల వరకు ఉన్న మొత్తం భూమిలో వాగులు, వంకలు, కొండ పోరంబోకు వంటి ప్రభుత్వ భూములు కూడా కొద్ది మొత్తంలో ఉన్నాయి.
ఆ భూముల విలువ ఇప్పుడు సుమారు రూ. 220 కోట్లు పైమాటే ఉన్నట్లు తెలిసింది. వాటిలో ఉన్న సున్నపు రాయి నిక్షేపాల్ని అప్పట్లో వైఎస్ ప్రభుత్వం సరస్వతి పవర్‌కి అడ్డగోలుగా కట్టబెట్టింది. దాని విలువే ఇప్పుడు సుమారు రూ. 10,308.80 కోట్లు ఉంటుందని గనుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఎకరాకు సుమారు 1.70 లక్షల టన్నుల సున్నపు రాయి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం సిమెంట్ గ్రేడ్ సున్నపు రాయి విలువ మార్కెట్‌లో టన్ను రూ. 400 వరకు ఉండటం గమనార్హం.
అయితే, సరస్వతి పవర్‌లో తనకు రూ. 26.4 కోట్ల విలువైన వాటాలు, తన భార్య భారతికి రూ. 13.8 కోట్ల విలువైన వాటాలు ఉన్నట్టు వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే 2019 డిసెంబరులో సరస్వతి పవర్‌కు గనుల లీజు పునరుద్ధరించడంతో పాటు, లీజు కాలపరిమితిని 50 ఏళ్లకు పెంచేసుకున్నారు. సరస్వతి పవర్‌కు కృష్ణా నది నుంచి 0.0689 టీఎంసీల జలాల్ని కేటాయించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు.









