UPDATES  

NEWS

 ఫోన్ ట్యాపింగ్ కేసే మొదటి బ్లాస్టింగా..?

కేసీఆర్ పాలనలో జరిగిన ఎన్నో స్కాముల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి. ఈ కేసులో చాలా కోణాలున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. భారీగా డబ్బు మూటలు చేతులు మారాయి. పొలిటికల్‌గా స్వప్రయోజనాలకు వాడుకున్నారు. ప్రస్తుతానికి ఈ కేసు విచారణ దశలో ఉంది. కానీ, కేసు కీలక దశకు చేరుకుందని తెలుస్తోంది. ఏ1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సరెండర్ అయినట్టు సమాచారం. విచారణకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమై, హైదరాబాద్ చేరుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీస్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.

 

ముందే చెప్పిన ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అరెస్టుల తర్వాత అందరి చూపు ప్రభాకర్ రావు వైపు పడింది. అమెరికాలో ట్రీట్మెంట్ అంటూ ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. అయితే, విచారణకు సహకరిస్తా, కానీ, అరెస్ట్ చేయొద్దని ఇన్వెస్టిగేషన్ అధికారులకు లేఖలు కూడా రాశారు. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అదే సమయంలో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. లుక్ అవుట్ నోటీసులు ఎప్పుడో ఇచ్చారు. దీంతో ప్రభాకర్ రావు ఎప్పుడు దేశం వచ్చినా ఇట్లే తెలిసిపోతుంది. కానీ, ఆయన వచ్చారని, తెలిసినా గోప్యంగా ఉంచుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

 

పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబ్ కోసమేనా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న అనుమానాలున్నాయి. బడా లీడర్లను అరెస్ట్ చేయాలంటే ఏ1 ప్రభాకర్ రావు స్టేట్మెంట్ చాలా కీలకం. పోలీసుల ముందు ఇచ్చే వాంగ్మూలం కంటే, మెజిస్ట్రేట్ ముందు ఇచ్చే స్టేట్మెంట్‌కి ఫుల్ పవర్ ఉంటుంది. మళ్లీ మార్చేందుకు వీలు ఉండదు. దానివల్ల ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని రాజకీయ సమాధి చేసేందుకు వీలు ఉంటుందనే ప్లాన్‌లో భాగంగానే ప్రభాకర్ రావు వచ్చిన విషయాన్ని దాచిపెట్టినట్టు మాట్లాడుకుంటున్నారు. నిజానికి వచ్చారా, లేదా రప్పించి, జైలుకు వెళ్లకుండా రక్షించి, సమాచారం అంతా సేకరించేందుకు ప్రచారం చేస్తున్నారో దీపావళి బాంబుల అరెస్టుల రూపంలో పేలనున్నట్లు మాత్రం స్పష్టం అవుతోంది.

 

అరెస్ట్ లిస్ట్‌లో ఉండేదెవరో?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించిన నేతలు చాలామంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా కూడా నేతలు ట్యాపింగ్‌ను వాడేశారు. లిస్ట్ చూస్తే చాలా పెద్దగానే ఉంటుంది. సాధరణ ఎన్నికల సమయంలో 3 ఉమ్మడి జిల్లాల మంత్రులు ఫోన్ ట్యాపింగ్‌ను తమ రాజకీయాలకు వాడుకున్నారు. అలాగే, మరో నిందితుడు శ్రావణ్ కుమార్, అతన్ని నడిపించిన ఓ పేపర్ ఓనర్‌తో పాటు పలువురు ఈ కేసులో ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ అధారంగా నిందితులు కాబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ నెలకొంది.

 

ప్రభుత్వం చెబుతున్న పొలిటికల్ బాంబులు ఏంటో ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు ఇవ్వబోతోంది. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఆనాడు జరిగిన స్కాముల్ని, నేతల లింకుల్ని వివరించనుంది.

అవాస్తవం

ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారని జరుగుతున్న ప్రచారంపై నగర సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందని, ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని, దేశంలో ఎక్కడ ఏ ఎయిర్‌పోర్టులో దిగినా తమకు సమాచారం వస్తుందని చెప్పారు.

అదరం.. బెదరం!

మంత్రి పొంగులేటి చేసిన పొలిటికల్ బాంబుల కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాంబులు‌ అంటే పొంగులేటి‌ మీద జరిగిన ఈడీ రెయిడ్ల గురించి అయి ఉంటుందేమోనని చమత్కరించారు. తమ మీద కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండని అన్నారు. ఈ బెదిరింపులకి తాము భయపడమని, ఒరిజినల్ బాంబులకే భయపడలేదని వ్యాఖ్యానించారు. మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని, ఒక్కొక్కరి సంగతి చూస్తామని హెచ్చరించారు. పొంగులేటి బాంబులు తుస్సేనంటూ మాట్లాడారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |