తెలంగాణలో మరో మూడు నెలల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ కులగణన చేపట్టాలని, బీసీలకు 42 శాతం రాజకీయ వాటా ఇవ్వాల్సిందేనని బీసీ సంఘాలు, బీసీ నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేశారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగానే బీసీ కులాలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులుతో పాటు బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మహిళా ప్రెసిడెంట్ మణిమంజరి సాగర్, ఇతర నేతలు సీఎంతో భేటీ అయ్యారు.
తెలంగాణలో బీసీలకు సామాజిక, ఆర్థిక, కుల గణన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో బీసీలకు స్వర్ణయుగం రానుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.