దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోపక్క దసరా పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున రకరకాల వంటలు, పిండి వంటకాలు చేసుకుంటున్నారు. దీంతో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో ఇవాల్టి నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు పామోలిన్ ఆయిల్ లీటరు రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124కే విక్రయిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఒక్కరికి ఎన్ని ఇస్తారంటే :
ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ చొప్పున అందించనున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధరపై ఆయిల్ ప్యాకెట్లు విక్రయించాలని మంత్రి మనోహర్ వ్యాపారులకు సూచించారు.
మంత్రి సమీక్ష…
విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కుకింగ్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్, వర్తక సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ మేరకు ధరల నియంత్రణపై సమీక్ష చేశారు.
పేద మధ్య తరగతుల వారికి ఇక్కట్లే…
ఉప్పు నుంచి పప్పుల వరకు నిత్యవసర సరకులు, బియ్యం నుంచి వంటనూనెల దాకా ధరలు ఎడాపెడా పెరిగిపోతున్నాయి. వీటికి కల్లెం వేసే నాథుడే కరవయ్యారు. దీంతో సామాన్యులు, మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కొండెక్కుతున్న కూరగాయలు…
మరోవైపు కాయగూరల ధరలు సైతం కొండెక్కి కూర్చుంటున్నాయి. టమాట ధరలు మార్కెట్లో కిలో రూ.80 నుంచి 100 పలుకుతోంది. ఇక దసరా పండుగ సమయాన మార్కెట్లోని అధిక ధరలతో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఊసురుమంటున్నాయి.
గత కొన్ని రోజులుగా అంతకంతకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సగటు వేతన జీవుడు అల్లాడుతున్నాడు. అత్తెసరు వేతనంతో కుటుంబాన్ని పోషించడం భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సగటు జీవులకు కాస్త ఊరటనిస్తుంది.