సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ అమలు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏక సభ్య కమిషన్ నియామకం వెంటనే చేపట్టడంతో పాటు 60 రోజుల్లోనే నివేదిక సమర్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్ట్‌కు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వేపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై తమకు అందిన వినతులు, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్గీకరణ అమలవుతున్న తీరు, హర్యానాలో తీసుకుంటున్న చర్యలను ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘంలోని సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సమావేశంలో వివరించారు.
న్యాయపరమైన చిక్కులు లేకుండా!
ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవకుండా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రేవంత్. కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు పెట్టారు. ఎస్సీ జనాభా లెక్కలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఏక సభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని సీఎస్‌ను ఆదేశించారు. రాష్ట్రంలో వర్గీకరణ అమలు, కులాల రీగ్రూపింగ్‌కు సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి అందిన వినతులపైనా సమావేశంలో విశ్లేషించారు. వాటన్నింటిని ఏక సభ్య కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించారు. కమిషన్ క్షేత్ర స్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా ఉమ్మడి పది జిల్లాల్లో ఒక్కో రోజు పర్యటించేందుకు ఏర్పాటు చేయాలన్నారు.
తక్షణమే రంగంలోకి
తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వేపై బిహార్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధికారులు వివరించారు. బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వే చేపట్టేందుకు అవసరమైన యంత్రాంగం తమ వద్ద లేనందున, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని కమిషన్ ఛైర్మన్ నిరంజన్, ముఖ్యమంత్రిని కోరారు. బీసీ కమిషన్ ఛైర్మన్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని అందుకు కేటాయిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ కమిషన్‌కు, రాష్ట్ర ప్రణాళిక విభాగానికి సమన్వయకర్తగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని శాంతికుమారిని ఆదేశించారు. 60 రోజుల్లోనే సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేయాలని డిసెంబరు 9లోపే నివేదిక సమర్పించాలన్నారు. ఈ సర్వే పూర్తయితే వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లొచ్చని చెప్పారు.