జమ్మూకాశ్మీర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదులతో శాంతి చర్చలకు సిద్ధమేనని అన్నారు. ఆయుధాలు వదులుకుని, ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని లేదా భద్రతా బలగాల చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా (Amit Shah) తీవ్రంగా హెచచరించారు. జమ్మూకాశ్మీర్‌లోని కఠువాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
ఓటు బ్యాంక్ రాజకీయా కోసం ప్రతిపక్షాలు ఉగ్రవాదులతో చర్చలు జరపాలని అడుగుతున్నాయని.. చర్చలు కావాలనుకుంటే ఆయుధాలు వదిలేసి రావాలని స్పష్టం చేశారు అమిత్ షా. లేదంటే భద్రతా బలగాలు వెంటాడుతాయని తేల్చి చెప్పారు. మూడు దశాబ్దాలకుపైగా ఉగ్రవాదం కారణంగా ఎన్నో కష్టాలను అనుభవించి ఇప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ఇదంతా బీజేపీతోనే సాధ్యమైందన్నారు.
జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందన్నారు అమిత్ షా. ఉగ్రవాదాన్ని పాతాళంలోకి తొక్కిపెట్టేవరకు విశ్రమించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఈశాన్య భారత్‌లో 10,000 మంది లొంగిపోయారని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో మొదటి రెండు దశల పోలింగ్ (సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25న) ముగియగా రికార్డు స్థాయిలో 55 శాతం ఓటింగ్ నమోదైందని తెలిపారు.
గతంలో ఎన్సీ, పీడీపీలు కొన్ని వేల ఓట్లతో ఎన్నికయ్యే రోజులు పోయాయన్నారుఅమిత్ షా. ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం మరింత బలపడిందన్నారు. గత 40 ఏళ్లుగా ఎన్సీ, కాంగ్రెస్ ఉగ్రవాదానికి రక్షణ కల్పిస్తున్నాయన్నారు. ఉగ్రవాదాన్ని తాము పాతాళంలోకి అణిచివేశామని చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు ముందుకు సాగేలా కాశ్మీర్‌కు కొత్త అభివృద్ధి మార్గాలను తెరిచామని అమిత్ షా పేర్కొన్నారు.
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కాగా, జమ్మూకాశ్మీర్ లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 1న జరగనున్నాయి. ఈ విడతలో మిగిలిన అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.