తెలంగాణ మహిళలంతా ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్న బతుకమ్మ పండుగ వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఇవ్వడం గత ప్రభుత్వ హయాంలో ఆనవాయితీగా వచ్చింది. అయితే తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈసారి బతుకమ్మ పండుగకు తెలంగాణ మహిళలకు అద్భుతమైన కానుక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
బతుకమ్మకు సర్ప్రైజ్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్న రేవంత్ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రోజు వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఆడపడుచులకు ఈసారి ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలకు బదులు మరో కానుక ఇవ్వడానికి రెడీ అయ్యారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల మహిళలకు ఈ సంవత్సరం బతుకమ్మకు చీరల స్థానంలో 500 రూపాయలు చొప్పున నగదు ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం.
నేరుగా వారి ఖతాలోకే డబ్బులు
తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఎటువంటి అవకతవకలకు తావులేకుండా నేరుగా మహిళల అకౌంట్లోనే ఆ డబ్బులను జమ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో బతుకమ్మ పండుగ సమయంలో ఇచ్చిన చీరలు మహిళలు తగలబెట్టడం, నాణ్యతలేని చీరలు ఇచ్చారని అసంతృప్తిని వ్యక్తం చేయడం, అదేవిధంగా బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం భావించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తుంది.
తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు శుభవార్త
అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజా నిర్ణయంతో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఖాతాలోను 500 రూపాయల నగదు పడనుందని ప్రస్తుతం భావిస్తున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ ఇదే నిర్ణయం తీసుకుంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒకే స్థాయిలో లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఇక మరికొద్ది రోజుల్లోనే బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతి త్వరలోనే ఈ విషయం పైన ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వస్తుందని సమాచారం.
గత చీరల పంపిణీ విధానానికి స్వస్తి పలికినట్టే
సీఎం రేవంత్ రెడ్డి చేసే ఈ ప్రకటనతో మహిళలు కచ్చితంగా సంతోషపడతారని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటివరకు నగదు పంపిణీ విషయం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బతుకమ్మ పండుగకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నగదు పంపిణీ ఎలా సాధ్యం అన్నది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన బతుకమ్మ చీరల పంపిణీ విధానానికి స్వస్తి పలికినట్టేనన్నది తాజాగా అర్థమవుతుంది.