UPDATES  

NEWS

 డిక్లరేషన్ రచ్చ.. జగన్ కు హిందూ సంఘాల వార్నింగ్..

గత కొన్ని రోజులుగా తిరుమల కేంద్రంగా జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గత వైసీపీ తప్పిదాలను కూటమి సర్కార్ వెలెత్తి చూపుతుంటే… చంద్రబాబు రాజకీయం కోసం లడ్డూ అంశాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ రెడీ అయ్యారు. దీంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈనెల 27న అంటే రేపు తిరుమలకు చేరుకునేందుకు జగన్ రెడీ అయ్యారు. ఎల్లుండి జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ పర్యటన వేళ కూటమి డిక్లరేషన్ అంశం తెరపైకి తీసుకొచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఇదే మరో వివాదానికి దారితీసింది.

 

తిరుమల లడ్డూ వ్యవహారం మరింత ముదిరింది. శనివారం కాలినడకన తిరుమలకు జగన్‌ వెళ్లనున్నారు. జగన్‌ టూర్‌ నేపథ్యంలో డిక్లరేషన్ రచ్చ మొదలైంది. డిక్లరేషన్‌ ఇచ్చే వెళ్లాలని కూటమి పార్టీల నాయకులు పట్టు పడుతున్నారు. డిక్లరేషన్‌ ఇవ్వకుండా వెళ్తే అడ్డుకుంటామని హిందూసంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌ డిక్లరేషన్‌ ఇస్తారా? అనే చర్చ మొదలైంది. అసలే తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. పైగా పొలిటికల్‌ హడావిడి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు అని ప్రభుత్వం సూచిస్తోంది.

 

అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్‌లో సంతకం పెట్టాలని అన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. వెంకటేశ్వర్ల స్వామిపై జగన్ కు విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని తెలిపారు.

 

బీజేపీ కూడా ఈ విషయంలో గట్టిగానే వాదిస్తోంది. చేతిన తప్పుకు క్షమాపణ చెప్పి.. డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీ పాలనలో లాగా కాకుండా స్వచ్ఛమైన నెయ్యితో చేతిన లడ్డూ చేస్తున్నామని.. స్వామివారి దర్శనం తర్వాత ఆ లడ్డే తీసుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

స్వాగతిస్తూనే సవాల్..

 

తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలన్న జగన్ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్వాగతించారు. అలాగే డిక్లరేషన్ పై ఆమె కూడా సవాల్ చేశారు. డిక్లరేషన్ ఇచ్చాకే స్వామివారి దర్శనం చేసుకోవాలన్నారు. ఇటు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే విషయం చెప్తున్నారు. జగన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకపోతే అది పెద్ద సమస్యగా మారుతుందన్నారు.

 

సెట్ అవ్వని సిట్

 

తిరుమలలో జరుగుతున్న అపవిత్ర కార్యక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్ ఇంకా సెట్ కాలేదు. సిట్ టీమ్‌పై ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. నిజానికి సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరును ఖరారు చేసినప్పటికీ.. మిగతా సభ్యుల విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇద్దరు సభ్యులుగా గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజును ఎంపిక చేశారు. కానీ మిగతా టీమ్ కోసం అన్వేషణ సాగుతోంది. గతంలో టీటీడీలో నిజాయితీగా పని చేసిన ఇతర సభ్యులను సిట్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాతే జీవో ఇష్యూ చేస్తారని సమాచారం. ఐతే ఈ రోజు సిట్‌పై జీఓ విడుదలయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |