UPDATES  

NEWS

 టీటీడీపై కొత్త పాలసీ.. సీబీఐ ఎంక్వైరీ..

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.

 

కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

 

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.

 

ఈ పరిణామాలపై మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. జంతువుల కొవ్వుతో శ్రీవారి లడ్డూను తయారు చేశారంటూ వస్తోన్న ఆరోపణల్లో గల వాస్తవాలను వెలికి తీయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

 

ఈ అంశంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఉందని, దాని పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటామని లోకేష్ అన్నారు. సీబీఐతో విచారణ చేయించడంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ స్టేట్‌మెంట్ ఇస్తారని స్పష్టం చేశారు. దోషులు ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

 

తిరుమలలో శ్రీవారి ప్రసాదాల తయారీ, టీటీడీ అనుసరిస్తోన్న విధానాలపై త్వరలోనే ఓ కొత్త పాలసీని తీసుకొస్తామని నారా లోకేష్ తెలిపారు. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టామని అన్నారు. రాత్రికి రాత్రి ఈ వ్యవస్థలో మార్పు రాబోదని, కొంత సమయంలో పడుతుందని వ్యాఖ్యానించారు.

 

నెయ్యి కల్తీ జరిగిందనేది తేటతెల్లమైందని, ఇది ఆరోపణలుగా కొట్టిపారేయడానికి ఏముందని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి నిర్దుష్టమైన పాలసీని తీసుకొస్తామని చెప్పారు. జగన్ కంటే ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారని, ఎవరూ కూడా తిరుమల విషయంలో జోక్యం చేసుకోలేదని అన్నారు.

 

 

ఈ అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్‌గా వైఎస్ఆర్సీపీ ఆరోపించడాన్ని నారా లోకేష్ తోసిపుచ్చారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసినట్లు రిపోర్ట్ స్పష్టం చేస్తోందని, ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |