తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ అంటే కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనది. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లుగా ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు-NDDB) నివేదిక తేల్చడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వ హాయంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వైఎస్సార్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టారు. నివేదికల్లో పొందుపర్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. మాజీ సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లడ్డుల్లో నెయ్యిపై జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా.. జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు.
ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైందని ఆనం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన NDDB CALF ల్యాబ్ ద్వారా వైఎస్సార్సీపీ బండారం బట్టబయలైందన్నారు. నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదని, ఆధారాలతో సహా నిరూపించారు.
నాణ్యమైన నెయ్యికి రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచిందని ఆనం తెలిపారు. నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్టు ఇచ్చారని, నాణ్యమైన నెయ్యి రూ.320కి ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. లంచాల కోసం 15 వేల కిలోల నెయ్యి టెండర్ ఇచ్చారని.. ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్ సర్టిఫికేషన్ లేదన్నారు.
నెయ్యి సర్టిఫికేషన్‌కు రూ.75 లక్షలతో ల్యాబ్ పెట్టే పరిస్థితిలో లేరా? అని ఆనం నిలదీశారు. నెయ్యి విషయమై ఎన్డీడీబీ ల్యాబ్‌లో పరీక్షలు చేసిందన్నారు. నెయ్యిలో చేప నూనె, పామాయిల్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తేలిందన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు నివేదికలో వెల్లడైందని ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు.
మరోవైపు, శ్రీవారి లడ్డు నాణ్యత అంశంపై టీటీడీ ఛైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు ఓవీ రమణ తప్పుపట్టారు. శ్రీవారి లడ్డూకు ఉపయోగించే నెయ్యి సరఫరా టెండర్‌ను గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఢిల్లీకి చెందిన ఆల్ఫా అనే సంస్థకు ఇచ్చారన్నారు. ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి బట్టర్ ఆయిల్ దిగుమతి చేసి రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యిగా టీటీడీకి సరఫరా చేసిందని ఆరోపించారు. సరఫరా చేసిన నెయ్యిని నామమాత్రంగా పరీక్షించి వినియోగించారన్నారు.
బండి సంజయ్ ఆగ్రహం
కోట్లాది మంది హిందువులు పరమపవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు జరిగిన ఈ భారీ ద్రోహాన్ని దేవుడు క్షమించడు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించే హిందువులకు లడ్డూలో జంతు కొవ్వును ఉపయోగించడం అనేది విశ్వాసం, నమ్మకానికి తీవ్ర ద్రోహం అని అన్నారు.
ఇతర వర్గాలు, నాస్తికులను ఉద్యోగులుగా,టీటీడీ బోర్డులోకి అనుమతించడం వల్ల హిందువుల విశ్వాసాల పట్ల అవినీతి, అగౌరవం ఏర్పడుతుందని గతంలో మేము ఆందోళనలు చేసాము. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు.