ఏపీలో సీప్లేన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేసారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా కేంద్రం తాజాగా సీ ప్లేన్ నిర్వహణ నిబంధనలను సరళీకరించింది. ఈ కార్యకలాపాలపై ఏపీ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సీప్లేన్ విమానాల డెమో మొదలు కానుంది. తొలుత విజయవాడ నుంచే ఈ డెమో ప్రారంభించేలా నిర్ణయం జరిగింది.
కేంద్ర అనుమతి
సీప్లేన్ కార్యకలాపాలకు సహకారం అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. నీటిపై ల్యాండ్ అవ్వడమే కాక, టేకాఫ్ జరిపే సీప్లేన్ కార్యకలాపాలకు సంబంధించిన నియమావళిని కేంద్ర పౌర విమానయాన శాఖ సరళీకరించింది. షెడ్యూలేతర సంస్థలు కూడా సీప్లేన్ సేవలు అందించడానికి అనుమతించింది. ఈ మేరకు సరళీకృత సర్టిఫైడ్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకమైన ఉడాన్ కింద ఈ సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించనుంది. సీప్లేన్ కార్యకలాపాలకు వయబులిటీ గ్యాప్ నిధులను కేంద్రం అందిస్తుంది.
ఏపీలో సీ ప్లేన్స్
డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సడలించిన నిబంధనల కింద సీప్లేన్ కార్యకలాపాలకు వాటర్‌డ్రోమ్ లైసెన్సు అవసరం లేదని పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాజా వాణిజ్య పైలెట్ లైసెన్సు (సీపీఎల్) ఉన్న వారు నేరుగా సీప్లేన్ రేటింగ్స్‌ను పొంది, సీప్లేన్‌లను నిర్వహించొచ్చని చెప్పారు. గతంలో అండమాన్-నికోబార్, గుజరాత్లో సీప్లేన్ కార్యకలాపాలు ఉండేవని పేర్కొన్నారు. అయితే ఆర్థికంగా మనుగడ సాధించలేక మూతబడ్డాయన్నారు. ఏపీ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు సీప్లేన్ కార్యకలాపాలపై ఆసక్తి చూపుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడుపేర్కొన్నారు.
విజయవాడ నుంచే
భారత్‌లో విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్ల డిజైన్, తయారీకి ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు సీప్లేన్ కార్యకలాపాలపై ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే సీప్లేన్ విమానాల డెమో, విజయవాడ నుంచే ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. సాధారణ విమానాశ్రయాల్లో ఎలాగైతే విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఉంటుందో వాటర్ ఏరోడ్రోమ్‌లలో సీప్లేన్‌ల టేకాఫ్, ల్యాండింగ్ జరుగుతుందని వెల్లడించారు.