UPDATES  

NEWS

 నూతన ఇంధన పాలసీపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పై చర్చించారు. కొత్త పాలసీపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

 

సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని …వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఏపీ అతిపెద్ద కేంద్రం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014- 2019 మధ్య కాలంలో దేశంలోనే టాప్ లో ఉన్న ఏపీ… 2019 తరవాత వచ్చిన ప్రభుత్వ విధానాలతో సంక్షోభంలోకి వెళ్లిపోయిందని అన్నారు.

 

రాష్ట్రంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా కొత్త పాలసీ ఉండాలని సూచించారు. పర్యావరణ హితంగా, టెక్నాలజీ ఉపయోగంతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై చర్చించారు. ఈ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా, వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా చూడాలని చంద్రబాబు సూచించారు.

 

వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను మరింత విస్తృతంగా అధ్యయనం చేసి కొత్త పాలసీకి రూపకల్పన చేయాలని తెలిపారు. 2029కి, 2047 నాటికి విద్యుత్ అవసరాలు, ఉత్పత్తిని మదింపు చేసి పాలసీ సిద్ధం చేయాలని సూచించారు.

 

రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకుకోవాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో కనీసం 500 చోట్ల ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు, సంస్థలు స్వయంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం, తమ అవసరాలు తీరిన తరువాత మిగిలిన విద్యుత్ ను అమ్ముకోవడాన్ని సులభతరం చేసేలా పాలసీ తీసుకురావాలని నిర్దేశించారు.

 

రాష్ట్రంలో లభించే క్వార్జ్ట్ ఖనిజం ద్వారా సోలార్ విద్యుత్ ప్యానళ్లు తయారు చేస్తారని….ఈ కారణంగా సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించే అంశంపైనా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |