మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయింది. ఈ స్థానం నుంచి వైసీపీ టికెట్ పై పోటీ చేసిన బొత్స సత్యనారాయణ యునానిమస్‌గా గెలిచేశారు. ఇందుకు సంబంధించి అధికార ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఆయనకు అందించారు. మూడేళ్లపాటు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య పడిపోయింది. చాలా మంది ఉద్ధండులు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇది వైసీపీని కుంగదీసింది. ఆ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో ఇదే తొలి ఎన్నిక. ఇందులో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా గెలిచారు. ఇది ఆయనతోపాటు పార్టీ శ్రేణులకు కొత్త ఊపును తెచ్చింది.
ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి పోటీ చేయలేదు. పోటీ చేయొద్దని కూటమి నేతలు ముందు నిర్ణయం తీసుకున్నారు. కానీ, బొత్స సత్యనారాయణ నామినేషన్‌కు పోటీగా నామినేషన్లు వచ్చాయి. అయితే, బొత్స సత్యనారాయణపై స్వంతంత్ర అభ్యర్థి షేక్ షఫీ నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో వీరిద్దరి నామినేషన్లు అధికారులు పరిశీలించారు. ఇద్దరివీ సరిగానే ఉండటంతో ఇరువురూ పోటీ పడతారని భావించారు. అయితే, ఉపసంహరణ సమయంలో షేక్ సఫీ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం లాంఛనంగా మారింది.
కానీ, వెంటనే బొత్స సత్యనారాయణ గెలుపును ప్రకటించే అవకాశం లేకపోయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం వరకు ఆగాల్సి వచ్చింది. ఈ రోజు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా గెలవడాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. బొత్స సత్యనారాయణ ఏకగ్రీవ గెలుపు తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కోడ్ తొలగిపోయింది.