బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు. పార్టీ మారిన పోచారంకు తప్పకుండా బుద్ధి చెబుతామని చెప్పారు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్‌లోని ఆయన నివాసంలో కేటీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారితో మాట్లాడారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించినప్పటికీ పార్టీని వీడారని అది ఆయనకే నష్టం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి తరువాత పార్టీని వీడటం కార్యకర్తను బాధించిందని తెలిపారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్‌ను పట్టించుకున్న వారే లేరని అన్నారు.
రేవంత్ రెడ్డి పరిపాలన సమర్థత ఏంటో ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయిందని అన్నారు. మార్పు పేరుతో జనాన్ని ఏమారుస్తున్నారని ఆరోపించారు. బాన్సువాడలో పోచారంను ఖచ్చితంగా ఓడిస్తామని తెలిపారు. త్వరలోనే ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీ సీనియర్ నేతలు సహా.. బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదని అన్నారు.
బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే కొండంత అండ అని అన్నారు. ఉప ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ మారిన వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ జెండాపై గెలిచిన పోచారం శ్రీనివాస్ పార్టీ వీడినా.. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు తెలిపారు.