తెలంగాణ మహిళలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాఖీ పండగ సందర్భంగా రాఖీలను, స్వీట్లను మహిళలు పంపించాలనుకున్న గమ్య స్థానాలకు 24 గంటలలోపే చేరవేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా గమ్య స్థానాలకు అనుకున్న సమయానికి రాఖీలను పంపిస్తామని తెలిపింది. రాఖీలతో పాటు స్వీట్లను చేరవేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా వంద కౌంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు.
ఈ నెల 19వ తేదీన రాఖీ పండగ సందర్భంగా స్వయంగా రాఖీ కట్టే అవకాశం లేని మహిళలు, యువతుల కోసం ఆర్టీసీ లాజిస్టిక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాఖీ సందర్భంగా రాఖీలు, స్వీట్ల బట్వాడా కోసం ప్రధాన బస్టాండ్లలో అదనంగా 100 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. బక్ చేసిన కౌంటర్ నుంచి 24 గంటల్లో వాటిని డెలివరీ చేస్తామని తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 490కి పైగా బుకింగ్ కౌంటర్లను 9 వేలకు పైగా పార్శిల్ రవాణా వాహనాలను, 190కి పైగా నాలుగు టన్నుల నుంచి 10 టన్నుల కార్గో వాహనాలను ఆర్టీసీ కలిగి ఉంది. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా చెప్పుకునే రాఖీ పండగ సందర్భంగా స్వయంగా రాఖీలను వెళ్లి కట్టలేని వారు. వారివారి అన్నలకు, తమ్ముళ్లకు పంపించవచ్చని తెలిపింది.