ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని రూపొందిస్తున్నది. నూతన పాలసీలో మద్యం ధరలను భారీగా తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ను కేవలం రూ. 80 నుంచి రూ. 90 కు విక్రయించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధర తగ్గినా కూడా నాణ్యత మాత్రం బాగుండేలా చర్యలు తీసుకోనున్నారని సమాచారం. తక్కువ ధర కేటగిరీలో గత ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ను రూ. 200 వరకు విక్రయించిన విషయం తెలిసిందే.
అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నది. ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. కాగా, ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు.. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలను అధ్యయనం చేశారు. ఒకటిరెండు రోజుల్లో ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించనున్నారు. మద్యం కొనుగోళ్లపై ఆయా కంపెనీలతోనూ ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చలు జరిపారు. అన్ని రకాల ఎంఎన్ సీ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల చివరి వరకు లేదా వచేచ నెలలో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.