UPDATES  

NEWS

 ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం..

ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, నిరసనల మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం స్పీకర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేటీఆర్ చర్చను ప్రారంభించారు.

 

సభలో ఏం జరిగిందో ప్రజలు చూశారు: సబితా ఇంద్రారెడ్డి

 

సభలో ఏం జరిగిందో అందరూ చూశారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సభ వాయిదా పడిన అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ… మీ వెనుక అక్కలు మమ్మల్ని ముంచారు… మిమ్మల్ని కూడా ముంచుతారని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారని, దానిని పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడి ఉంటారన్నారు.

 

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందే తాము ఆ పార్టీ కోసం కష్టపడ్డామన్నారు. తనతో పాటు సునీతా రెడ్డి ఆ పార్టీ కోసం పని చేశామన్నారు. రేవంత్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలతో తనకు, సునీతారెడ్డికి మాత్రమే అవమానం జరిగినట్లు కాదన్నారు. మహిళలందరికీ ఇది అవమానమే అన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

 

తాను అసెంబ్లీకి వచ్చి 24 ఏళ్లవుతోందని… ఈ కాలంలో చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డిలను చూశానన్నారు. కానీ తమను అనడం ద్వారా రేవంత్ రెడ్డి ఆ సీటుకు ఉన్న గౌరవాన్ని తగ్గించారన్నారు. అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అవుతుందనడం సరికాదన్నారు. అక్కలు అంటే అందరి క్షేమాన్ని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. సభలో తమ సమాధానం వినకుండానే వారు పారిపోయారన్నారు.

 

దేశంలో చాలామంది పార్టీ మారుతుంటారని… అదేం పెద్ద తప్పేమీ కాదన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డికి పార్టీ మారడం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తాను బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచానని… అలాంటి తనపై మాట్లాడే హక్కు ఎక్కడిదన్నారు. అసెంబ్లీలో కూడా ఆడబిడ్డలను అవమానించే సంస్కృతి రావడం దారుణమన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |