దేశ ప్రధానిగా నేడు నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఆయన వరుసగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టబోతున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.నరేంద్ర మోదీ 3.0 అనే నినాదంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు.
నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్‌కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తెర్సింగ్ టోబ్గేలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. . రాష్ట్రపతి భవన్‌లో వీవీఐపీలకు, కాబోయే మంత్రులకు ప్రత్యేక ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం ముగిశాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అతిథులకు విందు ఇవ్వనున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు విధించారు. ఆది, సోమవారాల్లో దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు.
బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా… మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సొంతంగా మెజారిటీ లేని నేపథ్యంలో మంత్రిపదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. టీడీపీ, జేడీయూ పార్టీలు కేంద్ర మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నాయి. హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు కీలకమైన విద్య, సాంస్కృతిక శాఖలను బీజేపీయే అట్టిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 30 మందితో కేంద్ర క్యాబినెట్ కూర్పు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి పదవి లభించనుందని సమాచారం అందుతోంది. ఒకవేళ జనసేనకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం ఇస్తే మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.