కేంద్రంలో మరికొన్ని గంటల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నరేంద్ర మోదీ ఇవాళ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ టీమ్‌లో ఎవరుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక టీడీపీ నుంచి ఎవరిని కేంద్ర మంత్రిపదవులు వరిస్తాయనే దానిపై క్లారిటీ వచ్చింది.
టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కిన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పు మీద కసరత్తు చేసిన బీజేపీ అధిష్ఠానం.. టీడీపీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటుగా, గుంటూరు ఎంపీగా తొలిసారిగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం.
రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ పదవి దాదాపు ఖరారు కాగా, పెమ్మసానికి సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై క్లారిటీ లేదు.
రామ్మోహన్ నాయుడు రాజకీయ ప్రస్థానం
కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు తండ్రి ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఆయన మాత్రం విజయం సాధించారు. ఈసారి శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై 3,14,107 మెజార్టీతో గెలుపొందారు.
రామ్మోహన్ నాయుడు (37) తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణాంతరం 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. ఎర్రన్నాయుడు 1996-1998 మధ్యకాలంలో ప్రధానులు హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ కేబినెట్‌లలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. రామ్మోహన్ నాయుడు ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రామ్మోహన్ నాయుడికి మంచి వాక్చాతుర్యం ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. ఈ నైపుణ్యతలతో రామ్మోహన్ నాయుడు పేరును కేబినెట్ బెర్త్ కోసం టీడీపీ సిఫార్సు చేసిన్నట్లు సమాచారం.