ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) ఇవాళ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా జూ.ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్
మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన మన మధ్య ఇక లేరనేది ఆలోచిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ‘నిన్ను చూడాలని’ సినిమాతో తనను సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలను ఎప్పటికీ మరవలేను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటే.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిరంజీవి
ఎన్టీఆర్‌తో పాటు రామోజీరావు అస్తమయంపై మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది.. ఓం శాంతి అంటూ తన ట్విట్టర్ (ఎక్స్)లో సంతాపం వ్యక్తం చేశారు.
నటుడు పృథ్వీ
అలాగే సినీ నటుడు పృథ్వీ రామోజీరావు మృతిపై సంతాపం తెలిపారు. ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు స్వర్గస్థులయ్యారు. చాలా బాధాకరం. వారి సంస్థలో ఈటీవీలో భాగవతం సీరియల్‌లో 9 ఏళ్లు పనిచేశాను. వారు మాకు భోజనం పెట్టినటువంటి మహాను భావుడు. అటువంటి మహానుభావుడు ఎంతోమంది టెక్నీషియన్లకు మంచి అవకాశం ఇచ్చి.. వారి జీవితాలను నిలిబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు లేరు అనే వార్త నిజంగా చాలా బాధకలిగించింది. వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
ఎంఎం కీరవాణి
నా భార్య అంటుంటది.. మనిషి అన్నవాడు బ్రతికితే రామోజీరావులా ఒక్కరోజు అయినా బ్రతకాలని అని. అలాంటి రామోజీరావును కలవడానికి వెళ్లినపుడు.. మీరు ఆస్కార్ తీసుకురండి అని అనగానే నేను ఆశ్యర్యపోయాను. రామోజీరావు ఆస్కార్‌కు ఇంత వ్యాల్యూ ఇస్తున్నారా.. అంటే దానిలో వ్యాల్యూ ఉందని.. దాన్ని ఎలాగైనా తీసుకురావాలి అనే టెన్షన్ నాలో ఎదురైంది. అయితే ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్ చేసే ముందర.. ఎవరి కోసం కాకపోయినా.. రామోజీరావు కోసం అయినా ఇది రావాలి అని అనుకున్నాను. అది వచ్చింది.. వచ్చిన తర్వాత ఇక మామూలే అని అన్నారు.